హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్ నగరానికి నలువైపులా ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే దూరప్రాంత, అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోని అంతర్గత ప్రాంతాల్లోకి రాకుండా ఆయా దిశల్లో ఏర్పాటు చేసే టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, హైదరాబాద్‌కు వచ్చే అంతర్‌జిల్లా బస్సులు కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపి, అక్కడి నుంచి ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే విధంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.
టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీంతో నగరంలోకి వచ్చే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం, రాత్రి సమయాల్లో రోడ్లపైకి పెద్ద సంఖ్యలో రావడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందని మంత్రి తెలిపారు.ఈ సమస్యకు పరిష్కారంగా ప్రైవేట్ బస్సులను కూడా నిర్దేశిత బస్ టెర్మినల్స్ ద్వారా నిర్వహించే విధానంపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. అవసరమైన నిబంధనల మేరకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ టెర్మినల్స్‌ను వినియోగించుకునే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ దూరప్రాంత బస్సులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధానం అమలులోకి వస్తే నగర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు.
బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.గాజులరామారం ప్రాంతంలో సుమారు 100 ఎకరాలు, శంషాబాద్ వైపు సుమారు 150 ఎకరాల భూమిని బస్ టెర్మినల్ అవసరాలకు కేటాయించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని టెర్మినల్స్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు, ప్రయాణికులకు వేచి ఉండే ప్రదేశాలు, పార్కింగ్, కనెక్టివిటీ తదితర సౌకర్యాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు.