ప్రొద్దుటూరు(రైట్స్ మీడియా): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార పనుల్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో పైలాన్ ఆవిష్కరించిన నేతలు ప్రతి ఇంటికీ కుళాయి, ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించేలా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.30,156 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం 13,075 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు 24,601 ఆవాసాలకు నీటి సరఫరాను విస్తరించనున్నారు. ఇందుకోసం 77,243 కిలోమీటర్ల పైపు లైన్ నెట్వర్క్ ను విస్తరించేలా పనులు చేపట్టనున్నారు. తద్వారా మొత్తం 61.60 లక్షల కుళాయి కనెక్షన్లకు మరింత మెరుగైన తాగు నీటి సరఫరా జరగనుంది. మొత్తంగా ఈ పనులతో 3.3 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95 లక్షల కుటుంబాలకు గానూ ఇప్పటికే దాదాపు 62 లక్షల కుటుంబాలకు ఇంటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయని సీఎం తెలిపారు. జల్ జీవన్ మిషన్–2.0 కింద మరో 27 లక్షల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇంటింటికీ తాగునీరు అందడం వల్ల ముఖ్యంగా మహిళల నీటి కష్టాలు తీరతాయని చంద్రబాబు పేర్కొన్నారు. నీటి కోసం వెచ్చించే శ్రమ, సమయం, ఖర్చు ఆదా అవుతాయని.. స్వచ్ఛమైన నీటితో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని వివరించారు. జల్ జీవన్ మిషన్ ప్రధాన ఉద్దేశం శాశ్వత నీటి వనరుల నుంచి ప్రజలకు తాగునీరు సరఫరా చేయడమేనని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో ఈ పథకం అమలులో లోపాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. కేంద్రం నుంచి భారీగా నిధులు పొందిన రాష్ట్రాలతో పోలిస్తే గత ప్రభుత్వం ఏపీలో ఈ పథకానికి కేవలం రూ. 2,600 కోట్లు మాత్రమే వినియోగిం చిందని పేర్కొన్నారు. తాగు నీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం తెలిపారు. పల్లె పండుగ–3.0 ద్వారా రూ.11,085 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, పంట కుంటలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం రానున్న కాలంలో రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.