గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామపంచాయతీ శివారులోని తూపురం వద్ద జరుగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్వే అధికారులు, సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్ రీ-సర్వే పనుల పురోగతిని, అనుసరిస్తున్న సర్వే విధానాన్ని పరిశీలించారు. అనంతరం రైతులను సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు.
భూ రీ-సర్వేను ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రీ సర్వే కోసం ఎంపిక చేసిన 70 గ్రామాలలో సర్వే చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 12 గ్రామాల్లో రీ సర్వే జరుగుతున్నదని, మిగిలిన గ్రామాల్లో కూడా సర్వే చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ల భద్రతకు అవసరమైన గమ్ షూస్, ఇతర రక్షణ పరికరాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు.
అలాగే రోవర్‌ తదితర ఆధునిక సాంకేతిక పరికరాలను సమర్థవంతంగా వినియోగిస్తూ సర్వే పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. గన్ పూర్ మండలంలో 6 గ్రామాలను రీ సర్వే కోసం ఎంపిక చేయగా ప్రస్తుతం 3 గ్రామాల్లో రీ సర్వే జరుగుతుందని తెలిపారు. భూ రీ-సర్వే అనంతరం ప్రతి రైతుకు వారి భూమికి సంబంధించిన స్పష్టమైన భూధార్ సంఖ్య,
భూ మ్యాపులు అందుతాయని, దీనివల్ల భూ రికార్డులు మరింత పారదర్శకంగా మారడంతో పాటు భూ వివాదాల పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలు తరువాత భూములు రీ సర్వే జరుగుతున్నదని, రైతులు సర్వే సిబ్బందికి సహకరించాలని తెలిపారు. రీ-సర్వే ప్రక్రియలో రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి కుసుమ కుమారి, ఆర్డిఓ హరికృష్ణ, తహసీల్దార్ రాజేస్వర రావు రైతులు తదితరులు పాల్గొన్నారు.

అప్పయ్యపల్లి రైతు కొప్పుల యాకయ్య మాట్లాడుతూ..
భూ సమస్యల పరిష్కారం కోసం గతంలో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ భూ రీ-సర్వే ప్రక్రియతో అధికారులే తమ గ్రామాలకు, తమ భూముల వద్దకు వచ్చి సర్వే నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
అప్పయ్యపల్లి గ్రామపంచాయతీ శివారు పరిధిలోని తూపురం వద్ద జరుగుతున్న డిజిటల్ భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా రైతు యాకయ్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో మా భూములకు సంబంధించిన సమస్యలు, భూ రికార్డుల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి పరిష్కారం కోసం రెవెన్యూ అధికారుల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు పరిస్థితి మారిందని, అధికారులే మా గ్రామానికి వచ్చి, మా భూముల వద్దే సర్వే చేస్తున్నారని తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భూముల కొలతలు చేపట్టడం, భూ వివరాలను డిజిటల్‌గా నమోదు చేయడం వల్ల భూ రికార్డుల్లో స్పష్టత ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి రైతు భూమికి సంబంధించిన హద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలు కచ్చితంగా నమోదైతే భవిష్యత్తులో భూ తగాదాలు తగ్గడంతో పాటు భూములకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అధికారుల వద్దకు మేము వెళ్లడం కాకుండా.. అధికారులే మా వద్దకు వచ్చి మా భూములను పరిశీలించి సర్వే చేయడం రైతులకు ఎంతో ఉపయోగకరమని, మా భూములకు సంబంధించిన వివరాలు స్పష్టంగా నమోదై, భూధార్ సంఖ్య, మ్యాప్ అందితే భవిష్యత్తులో మాకు మరింత భరోసా ఉంటుందని, ప్రభుత్వం చేపట్టిన ఈ రీ-సర్వే కార్యక్రమం రైతులకు ఎంతో మేలు చేస్తుందని యాకయ్య మరికొందరు పేర్కొన్నారు.

డిజిటల్ భూ రీ-సర్వే ద్వారా భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, కచ్చితత్వం పెరగడంతో పాటు రైతులకు తమ భూములపై స్పష్టమైన హక్కులు, వివరాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. రైతుల వద్దకే వచ్చి సర్వే నిర్వహిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకాలం భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన మాకు, ఇప్పుడు అధికారులు మా వద్దకు వచ్చి భూములను సర్వే చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ విధానం కొనసాగితే రైతులకు ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతుందని కొప్పుల యాకయ్య సంతోషం వ్యక్తం చేశారు.