శాయంపేట మండలంలోని గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.
శనివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లిలోని మిషన్ భగీరథ తాగునీటి శుద్దీకరణ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా రా వాటర్ ఎక్కడినుండి వస్తుందని, నీటి సరఫరా పరిస్థితి ఎలా ఉందని, పంపుల పనితీరు, క్లోరినేషన్, ఇన్‌ట్రా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, పంపింగ్ తీరు తదితర అంశాలను సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
శాయంపేట మండలంలోని 26 గ్రామాలకు రోజుకు ప్రస్తుతం సుమారు 5.35 ఎమ్ఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన అన్ని పంపులు పని చేసే స్థితిలో ఉన్నాయా, ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు వెంటనే వినియోగించేందుకు స్టాండ్‌బై పంపులు, ప్రత్యామ్నాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.