హనుమకొండ (రైట్స్ మీడియా): కాకతీయ విశ్వవిద్యాలయంలోని కే-హబ్‌లో TGEWIDC ఆధ్వర్యంలో, RUSA 2.0 నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు పలు సూచనలు చేసినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తెలిపారు. కేయూ కే-హబ్ ద్వారా ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయం కే-హబ్ మరియు T-Hub, హైదరాబాద్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందంలో భాగంగా విద్యార్థులు, యువ ఔత్సాహికులకు మెంటరింగ్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అంకుర సంస్థల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తూ ఉత్తర తెలంగాణలో ఒక ప్రముఖ ఇన్నోవేషన్, స్టార్టప్ కేంద్రంగా కే-హబ్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. త్వరలో దేశంలోనే అతి పెద్ద హ్యాకథాన్‌ కు కాకతీయ యూనివర్సిటీ వేదికగా నిలవనుందని రిజిస్ట్రార్ వెల్లడించారు. కలెక్టర్ వెంట RUSA నోడల్ అధికారి ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి, కే-హబ్ డైరెక్టర్ ఆచార్య టి. సవితా జ్యోత్స్న, అభివృద్ధి అధికారి ఆచార్య వై. వెంకయ్య తదితర అధికారులు ఉన్నారు.