Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు...

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు.

వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు...
Share Short Clip Download PDF

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో కూడిన మోడల్ కాలనీగా అభివృద్ధి చేసి పేదలకు గౌరవప్రదమైన జీవన వాతావరణం కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

మంగళవారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొత్తం కలియతిరిగి నిర్మాణాలు జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.

లబ్దిదారులతో మంత్రి మాట్లాడుతూ..

త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. కాలనీలో ఇప్పటికే విద్యుత్ స్తంభాలతో పూర్తిస్ధాయిలో వీధి దీపాల పనులు పూర్తి అయ్యాయని, వాటర్ ట్యాంక్ నుండి త్రాగునీటి పైప్‌లైన్ అనుసంధానం జరుగిందని తెలిపారు. అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణం, రవాణా సౌకర్యం కల్పించేలా పనులు జరుగుతున్నాయని, నిర్మాణాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లులను ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. ఇక్క ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టి తీసుకురావాలని తెలిపారు.

ప్రజల మౌళిక అవసరాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి కుటుంబానికి త్రాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి సదుపాయాలు సమగ్రంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గత పది సంవత్సరాల కాలంలో పేదలు మౌళిక సదుపాయాల కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన గృహ నిర్మాణం పూర్తి చేయించడమే లక్ష్యమని అన్నారు.

వెలుగుమట్ల కాలనీలో విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్య వ్యవస్థ వంటి అన్ని సదుపాయాలు సమగ్రంగా ఏర్పాటు చేసి ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. సామాజిక వసతులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని వెల్లడించారు.

హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ, నిర్దేశిత గడువులోనే అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గప్రసాద్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు డి. జయచందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.