తిరుపతి(రైట్స్ మీడియా): సాంకేతికత పెరిగిన నేటి కాలంలో ఫిజికల్ స్టాకింగ్ కంటే సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే సైబర్ స్టాకింగ్ ఎక్కువైందని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ సహకారంతో తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో ‘స్టాకింగ్ నివారణ’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఒక నంబర్‌ను బ్లాక్ చేసినా వేరొక నంబర్ నుండి పదేపదే కాల్స్ చేయడం, అనుమతి లేకుండా గిఫ్ట్‌లు పంపడం, ఫొటోలతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వేధించడం కూడా స్టాకింగ్ కిందకే వస్తాయని తెలిపారు. మహిళలు భయపడకుండా వేధింపులను తొలిదశలోనే గుర్తించి తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
అత్యవసర సమయంలో 181, 112, 1930 (సైబర్ నేరాలు) హెల్ప్‌లైన్ నంబర్లను మరియు శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని కోరారు. అలాగే జీరో ఎఫ్‌ఐఆర్, గుడ్‌టచ్-బ్యాడ్‌టచ్‌లపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అదనపు ఎస్పీ శ్రీలత, ఎస్వీయూ ప్రతినిధులు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.