హైదరాబాద్(రైట్స్ మీడియా): ఎన్నికల్లో ప్రజా మద్దతు పొందలేక, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేసే కుట్రలకు కాంగ్రెస్ పార్టీ, ‘ఇండీ’ (I.N.D.I) కూటమి తెరలేపాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డా. కె. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, ఎన్నికల వ్యవస్థ పట్ల ఆ పార్టీకి ఉన్న నల్ల చరిత్రను ఎండగట్టారు.
రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్, ‘ఇండీ’ కూటమి ముప్పేట దాడి: డాక్టర్ కె. లక్ష్మణ్
• ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలు – బోగస్ ఓట్లు తీసేయాలని గతంలో వారే డిమాండ్ చేశారు
• తెలంగాణలో రైతుల కష్టాలు, కరెంట్, సాగునీటి సంక్షోభాన్ని గాలికొదిలేసి ఢిల్లీ ధర్నాల డ్రామాలు
• ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టులను నిర్వీర్యం చేసే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డా. కె. లక్ష్మణ్
బోగస్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్, ఆప్ ద్వంద్వ నీతి:
దేశవ్యాప్తంగా అక్రమ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులేనని లక్ష్మణ్ గుర్తుచేశారు. మధ్యప్రదేశ్‌లో 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని కమల్‌నాథ్, గుజరాత్లో 40 లక్షల దొంగ ఓట్లను తొలగించాలని పీసీసీ అధ్యక్షుడిగా శక్తిసింగ్ గోయిల్, ఢిల్లీలో 10 లక్షల నకిలీ ఓట్లున్నాయని అర్విందర్ సింగ్ లవ్లీ, అలాగే 11 లక్షల బోగస్ ఓట్లను ఈసీ తొలగించాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ స్వయంగా ఎన్నికల సంఘానికి గతంలో వినతిపత్రాలు ఇచ్చారని తెలిపారు. కేరళoలో సీపీఎం దొంగ ఓట్లను తొలగించినందుకు కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల ఎన్నికల సంఘానికి బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారని ప్రస్తావించారు. అక్రమంగా నివసించే వారి ఓట్లను తొలగించాలని సచిన్ పైలట్ సైతం గతంలో డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఆనాడు తొలగించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు చట్టబద్ధంగా సమగ్ర సవరణ చేపట్టి దొంగ ఓట్లను ఏరివేస్తుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ వీధుల్లోకి రావడం వారి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
న్యాయవ్యవస్థపై బ్లాక్మెయిల్ రాజకీయాలు:
సుప్రీంకోర్టు స్వయంగా ఓటర్ల సవరణ ప్రక్రియను సమర్థించినప్పటికీ, దాదాపు 42 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు బహిరంగ లేఖ ద్వారా కాంగ్రెస్ నిరాధార 'ఓట్ చోరీ' ఆరోపణలను తప్పుపట్టినప్పటికీ కాంగ్రెస్ తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు డోర్లు అందరికీ తెరిచి ఉంటాయని సీజేఐ స్పష్టం చేసినా, వ్యవస్థలను పక్కనబెట్టి సుప్రీంకోర్టు ముందే ధర్నాలు చేస్తామని ప్రకటించడం న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమేనని అన్నారు. రాష్ట్రపతిని కలిసిన 'ఇండీ' కూటమి వద్ద ఓట్ల చోరీపై ఎలాంటి ఆధారాలు లేవని, ఆధారాలు సమర్పిస్తామంటూ రాహుల్ గాంధీ ముఖం చెల్లక తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలపై సాధారణ ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల మేరకే ప్రత్యామ్నాయ వేదికలను సూచించారని గుర్తుచేశారు.
ఎన్నికల సంఘాన్ని జేబు సంస్థగా మార్చిన కాంగ్రెస్ నల్ల చరిత్ర:
ఎన్నికల పారదర్శకత గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని, నేటి యువత (జెన్ జీ, జెన్ ఆల్ఫా) కాంగ్రెస్ అసలు చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు. మొదటి సీఈసీ సుకుమార్ సేన్ సోదరుడు అశోక్ సేన్‌ను కాంగ్రెస్ ఎంపీని చేసి కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవి ఇవ్వడం క్విడ్ ప్రో కో కాదా అని ప్రశ్నించారు. సీఈసీ ఆర్కే త్రివేది పదవీ విరమణ చేయగానే రాజీవ్ గాంధీ ప్రభుత్వం గవర్నర్ పదవి ఇవ్వడం, టీఎన్ శేషన్‌కు 1999లో ఎల్కే అద్వానీపై కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీ పెట్టడం, సీఈసీగా పనిచేసిన ఎం.ఎస్. గిల్‌ను రాజ్యసభకు పంపి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర క్రీడల మంత్రిని చేయడం కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ అకృత్యాలపై షా కమిషన్ తప్పుపట్టిన నవీన్ చావ్లాను సోనియా గాంధీ ఆదేశాలతో ఎన్నికల కమిషనర్‌గా నియమించారని, ఆయన ఏకపక్ష వైఖరిపై నాటి సీఈసీ గోపాలస్వామి 14 ఆరోపణలతో రాతపూర్వక ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే:
1952లో బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఓడించడానికి కమ్యూనిస్టులతో చేతులు కలిపిన చరిత్ర, 1957లో బెగుసరాయ్‌లో దేశంలోనే మొదటి బూత్ క్యాప్చరింగ్‌కు తెరలేపిన ఘనత కాంగ్రెస్‌దేనని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బ్యాలెట్ రిగ్గింగ్‌ను అరికట్టడానికే ఈవీఎంలు తెస్తే, ఇప్పుడు మళ్లీ బూత్ క్యాప్చరింగ్ చేసుకోవడానికే బ్యాలెట్ సిస్టమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. 1975లో అలహాబాద్ కోర్టు ఇందిరా గాంధీ ఎన్నికను రద్దు చేసి ఆరేళ్ల నిషేధం విధిస్తే, అధికారాన్ని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాలరాసిన చరిత్ర వారిదని దుయ్యబట్టారు. 1980లో సోనియా గాంధీకి భారత పౌరసత్వం రాకముందే న్యూఢిల్లీలో ఓటరుగా నమోదు కావడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 1980లో ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ 9 రాష్ట్రాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఇందిరా గాంధీ రద్దు చేశారని గుర్తుచేశారు. 1983లో అస్సాంలో ఓటర్ల జాబితా సవరించకుండా బలవంతంగా ఎన్నికలు పెట్టి నెల్లీ మారణకాండకు కారణమయ్యారని, 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో గెలవడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలను నోట్ల కట్టలతో కొనుగోలు చేశారని ఎండగట్టారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి చేసిన రిగ్గింగ్ వల్లే లోయలో ఉగ్రవాదం పురుడుపోసుకుందని, 1972 బెంగాల్ ఎన్నికల రిగ్గింగ్, 2018 కర్ణాటక రాజరాజేశ్వరి నగర్లో కాంగ్రెస్ అండతో వేల నకిలీ ఓటర్ ఐడీలు పట్టుబడిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు.
దేశవ్యాప్తంగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియలో ఈఆర్వోలు, డీఆర్వోలు, బీఎల్వోలతో పాటు దాదాపు 46 లక్షల మంది అధికార యంత్రాంగం, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. 95 కోట్ల మంది ఓటర్లలో 82 కోట్ల మంది తిరిగి పారదర్శకంగా పేర్లు నమోదు చేసుకున్నారని, ఇది 100 నుండి 150 రోజుల పాటు సాగిన ప్రక్రియ అని వివరించారు. ఫారమ్-7 ద్వారా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకే దేశవ్యాప్తంగా 29 లక్షల బోగస్ ఓట్లను తొలగించారని స్పష్టం చేశారు. దాదాపు 2 కోట్ల 89 లక్షల మంది చనిపోయిన వారి ఓట్లను, అలాగే గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్లి డబుల్ ఎంట్రీ ఉన్న ఓట్లను తొలగిస్తే, చనిపోయిన వారి ఓట్లను కూడా కొనసాగించాలనడం దొంగ ఓట్లతో గెలవాలనే కాంగ్రెస్ దురుద్దేశాన్ని సూచిస్తోందని విమర్శించారు.
తెలంగాణ రైతులను గాలికొదిలేసి ఢిల్లీలో ధర్నాల డ్రామాలు:
తెలంగాణలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి, సాగునీరు లేక, 24 గంటల ఉచిత విద్యుత్ రాక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి అధిష్టానం మెప్పు కోసం ఢిల్లీ ధర్నాల పేరిట నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓట్ల సవరణ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, దాదాపు 36 లక్షల మంది అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్ల సమక్షంలోనే జరిగిందని, సొంత ప్రభుత్వ ఉద్యోగులపైనే కాంగ్రెస్ నేతలకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లలో గెలిస్తే ప్రజా తీర్పు అని, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వ నీతి అని దుయ్యబట్టారు. ఎలక్షన్ కమిషన్ సవరణ ప్రక్రియపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. 25 ఏళ్లుగా మచ్చలేని ప్రజా జీవితం గడుపుతూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలకు తెలంగాణ సమాజం, దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.