జీడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 17(రైట్స్ మీడియా): నగర పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రజలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు.

శనివారం ఉదయం నగరంలోని కాళోజీ కళాక్షేత్రం నుంచి అదాలత్ జంక్షన్ వరకు, అలాగే పలు ప్రాంతాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించి, పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లు, రహదారుల పక్కన ఉన్న ప్రాంతాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు సూచించారు.

పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. సెంట్రల్ మీడియన్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు.

పారిశుద్ధ్య సిబ్బంది కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించేలా అధికారులు పర్యవేక్షించాలని, రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. నగర పరిశుభ్రతను నిరంతర ప్రక్రియగా పరిగణిస్తూ, అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

నగరంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, ఇతర ప్రకటనల బోర్డులను నిబంధనల ప్రకారం తొలగించాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రహదారులపై ఆక్రమణల వల్ల ప్రజలకు, ట్రాఫిక్ కు,వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

నగరంలో పరిశుభ్రతను మెరుగుపరచడంతోపాటు రహదారులను ఆక్రమణల నుంచి విముక్తం చేసి, నగర సుందరీకరణకు ప్రాధాన్యతనివ్వాలని కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ పర్యటనలో సీఏంహెచ్‌ఓ డాక్టర్ వాజారెడ్డి, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.