కామారెడ్డి (రైట్స్ మీడియా): అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన పంటను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఓ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. చివరికి దోమపోటు సోకిన వరి పంటకు డీజిల్ పోసి నిప్పంటించాడు.
కష్టపడి పండించిన పంట కళ్ళముందే నాశనమవుతుంటే తట్టుకోలేకపోయిన అన్నదాత...
తీవ్ర మనోవేదనకు గురై పంటకు నిప్పు పెట్టుకున్న బాధాకరమైన ఘటన...
తీవ్ర మనోవేదనకు గురై పంటకు నిప్పు పెట్టుకున్న బాధాకరమైన ఘటన...
ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకుంది. పాల్వంచ మండలానికి చెందిన వెంకట్రాములు అనే రైతు తన పొలంలో సన్న రకం వరి సాగు చేశాడు. పంట చేతికొస్తుందన్న ఆశతో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. అయితే పంటకు దోమపోటు తెగులు సోకడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెగులును అరికట్టేందుకు వారం రోజులుగా ఎరువులు, పురుగు మందుల దుకాణాల నుంచి మందులు తెచ్చి పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటను పాయలుగా విడదీసి మందులు చల్లినప్పటికీ తెగులు అదుపులోకి రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన పంటను కాపాడుకోలేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన వెంకట్రాములు దోమపోటు సోకిన వరి పంటపై డీజిల్ చల్లి నిప్పంటించాడు.
ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగి, పంటల సాగు సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో తెగుళ్ల బెడద రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వాతావరణ మార్పులకు తోడు పంటలను ఆశిస్తున్న తెగుళ్లను సకాలంలో గుర్తించి, సరైన నివారణ చర్యలు తీసుకోకపోతే అన్నదాతకు తీవ్ర నష్టం తప్పదు. అన్నదాతలకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ సకాలంలో సాంకేతిక మార్గదర్శకత్వం, సరైన తెగులు నివారణ సూచనలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నాడు.