నరసరావుపేట(రైట్స్ మీడియా): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కూటమి ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నరసరావుపేట ఎన్జీఓ కాలనీలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశాం: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశాం: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
హామీల అమలులో కూటమి ప్రభుత్వం ముందంజ
రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. నెలకు రూ.4 వేల పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలతో ఎన్నికల హామీల్లో దాదాపు 90 శాతం అమలు చేసినట్లు వివరించారు.
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన గమ్యస్థానం
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నాయని ఎంపీ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి రూ.100 పెట్టుబడుల్లో రూ.25 ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని పేర్కొన్నారు. బీపీసీఎల్, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్, రాయలసీమలో హోండా సంస్థతో పాటు రక్షణ రంగ తయారీ యూనిట్లు రాష్ట్రానికి రావడం శుభపరిణామమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించడం పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడుతోందన్నారు.
స్థానిక ఎన్నికలకు వైసీపీ దూరం
స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనలేదని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లో నామినేషన్లు వేసి, ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారని ఆరోపించారు. గతంలో చేసిన అభివృద్ధి లేమి ప్రజల ముందు బయటపడుతుందనే భయంతోనే ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు.
గురజాల, మాచర్ల, పిడుగురాళ్లకు సాగర్ జలాలు
నరసరావుపేట పార్లమెంట్ పరిధితో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ తెలిపారు. గురజాల, మాచర్ల, పిడుగురాళ్ల ప్రాంతాలకు రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో నాగార్జునసాగర్ జలాలను అందించే పనులు చేపట్టినట్లు వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించి గ్రామాల్లో తాగునీటి సరఫరా పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
రూ.1,500 కోట్లతో రహదారుల అభివృద్ధి
ప్రాంతీయ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కొండమోడు–పిడుగురాళ్ల, వినుకొండ–గుంటూరు, చిలకలూరిపేట–నకరికల్లు రహదారుల పనులు సుమారు రూ.1,500 కోట్లతో వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సాగునీరు, రహదారులు, వైద్య విద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 50 సీట్ల సామర్థ్యంతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పాటు ఆసుపత్రిలో ఓపీ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు.
అభివృద్ధిపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం
ప్రతిపక్షాలు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్మాణాత్మక సూచనలు చేయకుండా విమర్శలు, తప్పుడు ప్రచారానికే పరిమితమవుతున్నాయని ఎంపీ విమర్శించారు. గతంలో అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించిన వారే నేడు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను వివరించాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ మీడియా సమావేశంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.