నగరంలో భవన నిర్మాణ అనుమతులను నిబంధనల ప్రకారం మాత్రమే మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. మంజూరైన అనుమతులకు అనుగుణంగానే నిర్మాణాలు జరిగేలా టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలకు నిబంధనల మేరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు వీలైనంత త్వరగా జారీ చేయాలని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించి, నగరంలో క్రమబద్ధమైన పట్టణ ప్రణాళిక అమలయ్యేలా చూడాలన్నారు.
యూఐడీఎఫ్ నిధులతో మంజూరైన పనుల్లో ఇప్పటివరకు ప్రారంభం కాని 30 పనులను వెంటనే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.
నగరంలో కొనసాగుతున్న భూగర్భ మురుగునీటి పారుదల పనులను ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
నగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని నగరంలోని రహదారుల మధ్య డివైడర్లలో ఉన్న మొక్కలకు నీరు అందించేందుకు వినియోగించాలని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.