Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఈ నెల 30న రాజన్న సిరిసిల్లకు ముఖ్యమంత్రి రాక: విలేఖరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

ఈ నెల 30న రాజన్న సిరిసిల్లకు ముఖ్యమంత్రి రాక: విలేఖరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
Share Short Clip Download PDF

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబరు 29 (రైట్స్ మీడియా):
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు రానున్నారని, ఈ పర్యటనను అత్యంత జయప్రదం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన ప్రతి ఒక్క కార్యకర్త పెద్ద ఎత్తున తరలిరావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణ రావు, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డిలతో కలసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం 33 నెలలుగా విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతాంగం, కార్మికులు, విద్యార్థుల సంక్షేమానికి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని అన్ని దిశలా సమగ్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతోందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో, ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఏకైక ఆలోచనతో పనిచేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు బాధ్యతగల రీతిలో ప్రవర్తించకుండా విచ్ఛిన్నకరమైన విధానాలతో ముందుకు పోతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బిఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినా, వర్షాలు పడకపోయినా సంతోషపడే నీచమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎల్ నినో ప్రభావం వల్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో, అందరూ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావాల్సిన సమయంలో కూడా ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. వర్షాలు పడకపోతే సంతోషపడటం, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ విషయంలో కోర్టు స్టే ఇచ్చినా సంబరపడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. మంచి వర్షాలు కురవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూజలు చేస్తూ పాజిటివ్‌గా ముందుకు వెళ్తుంటే, బిఆర్ఎస్ నాయకులు మాత్రం నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంత పెద్ద ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ పరిస్థితులను క్రమబద్ధీకరించుకుని ముందుకు వెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలపై ఏ ఒక్క రూపాయి చార్జీల భారం గానీ, విద్యుత్ చార్జీల పెంపు గానీ లేదా ఇతర పన్నుల భారం గానీ వేయకుండా పాలన సాగిస్తున్నామని వివరించారు.

గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, అనేక నూతన సంక్షేమ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సబ్సిడీ, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, మహిళా సంఘాలకు రూ. 5 నుండి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించడం మరియు నిరుద్యోగులకు దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయడం లాంటి ఎన్నో చారిత్రాత్మక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వీటితో పాటు వ్యవసాయ, కార్మిక, విద్యా, వైద్య రంగాల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్లకు వస్తుండటంతో బిఆర్ఎస్ నాయకుల్లో భవిష్యత్ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు. బాధ్యత గల ప్రతిపక్షంగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన బిఆర్ఎస్ నేతలు రాష్ట్రానికి విచ్ఛిన్నం కలిగించేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు తగిన జ్ఞానోదయం కలిగించేలా సిరిసిల్ల వేదిక నుంచే ముఖ్యమంత్రి బలమైన సందేశాన్ని ఇవ్వనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
ఈ నెల 30న సిరిసిల్లకు ముఖ్యమంత్రి రాక: విలేఖరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి