రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రుద్రగూడెం క్రాస్ రోడ్డు వద్ద వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం నిరసన రైతు ధర్నా నిర్వహించారు. నీటిపారుదల రంగం నిర్లక్ష్యం, రైతుబంధు పథకం అమలులో జాప్యం, రైతుబీమా పునరుద్ధరణలో నిర్లక్ష్యం, యూరియా కొరత, విద్యుత్ సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నల్లబెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి మాట్లాడుతూ..
రైతు డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన హామీల అమలులో మోసం చేసిందని ఆరోపించారు. ఆగస్టు 14న పునరుద్ధరించాల్సిన రైతుబీమా పథకాన్ని నేటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రైతుబంధు కింద ఎకరాకు రూ. 15 వేలు, ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ హామీలపై రైతులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో తెచ్చిన రంగయ్య చెరువు ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.