41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని గురువారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, భూపాలపల్లిలో నేత్రదానంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదానం ప్రాముఖ్యత, ప్రయోజనాలు ప్రజల్లో ఉన్న అపోహలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. బి.ఆర్. భరత్ కుమార్ మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును ప్రసాదించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని, కుటుంబ సభ్యులకు కూడా దాని ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. దేవేందర్ మాట్లాడుతూ.. నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నేత్రదానం మరణానంతరం మరొకరి జీవితంలో వెలుగును నింపే మహత్తర మానవతా కార్యక్రమమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి. హెప్సీబా, ఆప్కామిక్ అధికారి బూరుగు రవికుమార్, మురళీధర్ రెడ్డి, ఎన్‌సీడీ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.