హైదరాబాద్ (రైట్స్ మీడియా): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గాంధీ భవన్లో బతుకమ్మ సంబరాలు.. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోంది: మహేష్ కుమార్ గౌడ్
సతీమణితో కలిసి పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పెద్దలు ఆశీర్వదిస్తూ అందించే ‘బతుకు అమ్మా’ అనే దీవెనలోనే బతుకమ్మ పండుగ గొప్పతనం ఇమిడి ఉందని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను చాటిచెబుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజాపాలన సాగిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కేంద్రంగా ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, తెలంగాణ ప్రజలందరికీ సుఖశాంతులు, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
గాంధీ భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.