జయశంకర్ భూపాలపల్లి (రైట్స్ మీడియా):
బుద్దారం గ్రామంలో భూసేకరణకు సంబంధించి ప్రతిపాదించిన భూసేకరణ ప్రక్రియ చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు.
బుధవారం ఐడీఓసీలో రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భూసేకరణ, పెగ్ మార్కింగ్, సర్వే పనులపై కలెక్టర్ తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్దారం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియలో భాగంగా సర్వేయర్ల సహకారంతో క్షేత్రస్థాయిలో అలైన్మెంట్ను స్పష్టంగా గుర్తించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.
రామప్ప నుంచి నీటిని తరలించే ప్రతిపాదనలపై సమీక్షించి ఈ ప్రాజెక్టు ద్వారా ఎనిమిది మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
భూసేకరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందించి, పెండింగ్లో ఉన్న ప్రక్రియలు, టెండర్లు, ఇతర పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రాజెక్టుల అమలులో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 15వ తేదీ
గురువారం వరకు ఇరిగేషన్ అధికారులు భూ సేకరణ అవసరమైన మేరకు పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. పెగ్ మార్కింగ్, రీ సర్వే పనులను ఆర్డిఓ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇప్పటికే పనులలో జాప్యం జరిగిందని జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. జూలై వరకు నీళ్ళు ఇవాల్సి ఉన్నందున రామప్ప నుండి నీరు రాకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, పనులను వేగవంతం చేయాలని జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యమైన సమావేశానికి అనుమతి లేకుండా గైర్హాజరైన గన్ పూర్ సబ్ డివిజన్ డిఈ సదయ్యకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటి కలెక్టర్ నవీన్ రెడ్డి, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.