మేడపల్లి–రాంపూర్–ఆశ్రవెల్లి గ్రామాల మధ్య అధ్వానంగా మారిన రహదారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆయా గ్రామాల ప్రజలు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో నల్లబెల్లి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
ప్రజావాణిలో నల్లబెల్లి ఎంపీడీవోకు గ్రామస్థుల వినతి.
అధికారులు వెంటనే స్పందించి, రహదారి సమస్యను పరిష్కరించాలి..
ఈ మార్గంలో మేడపల్లి, రాంపూర్, ఆశ్రవెల్లి గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు విద్యార్థులు, రైతులు, వాహనదారులు నిత్యం ప్రయాణిస్తుంటారని పేర్కొన్నారు. రహదారి దుస్థితి కారణంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులు ప్రమాదాల బారినపడే పరిస్థితి నెలకొందన్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరడంతో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి దెబ్బతినడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ రహదారికి తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు త్వరగా నూతన రహదారి నిర్మాణ పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. సమస్యను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి రహదారి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను గ్రామస్థులు కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి, రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.