రాజన్న సిరిసిల్ల (రైట్స్ మీడియా): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
బీసీ సమాజం సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం.. నా బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్
⏩ముదిరాజ్ సింహగర్జన బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఇతర ముఖ్య నేతలు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
ముదిరాజ్ సమాజం కోసం, మన హక్కుల కోసం గట్టిగా మాట్లాడే శక్తి మనకు ఉండాలని, ఎక్కడ మన సమస్య కనిపించినా అక్కడ ధైర్యంగా మన గొంతు వినిపించాలని పిలుపునిచ్చారు. తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేయడం నేర్చుకున్నానని, దాదాపు మూడు దశాబ్దాలుగా బీసీ సమాజం కోసం పనిచేస్తున్న అనేక మంది నాయకులతో తనకు అనుబంధం ఉందని తెలిపారు. మన బలం ఐక్యతలోనే ఉందన్న ఆయన, పార్లమెంటులో అయినా, శాసనసభలో అయినా మన హక్కుల కోసం గట్టిగా మాట్లాడే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా బీసీ సమాజం సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. శ్రీహరి గారి నాయకత్వంలో, బండా ప్రకాశ్ గారి మార్గదర్శకత్వంలో ముదిరాజ్, బీసీ సమాజ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని, ముఖ్యమైన నాయకులతో కలిసి త్వరలో ముఖ్యమంత్రిని కలిసేందుకు, కార్యాచరణ రూపొందించుకునేందుకు కృషి చేస్తామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని అడిగే హక్కు మనకు ఉందని, కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందన్నారు.
అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని ప్రకటించి, జనగణనలో బీసీల అంశాన్ని చేరుస్తామని చెప్పి మోసం చేశారని, దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల జనాభా ఎంత ఉందో తెలుసుకోవడానికి కులగణనకు మద్దతు ఇచ్చామని, దేశవ్యాప్తంగా కూడా కులగణన జరిగి బీసీల జనాభా అధికారికంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. “జిత్నీ ఆబాది ఉత్నే ఇసేదారి” (జనాభా ప్రాతిపదికన వాటా) అనే సూత్రం ప్రకారం జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు, ప్రాతినిధ్యం ఉండాలనే డిమాండ్ బలంగా వినిపించాలన్నారు. మన జనాభా ఎంత ఉందో ఖచ్చితంగా తెలిస్తేనే మనకు ఎంత ప్రాతినిధ్యం కావాలి, ఎంత వాటా కావాలి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం అనే విషయాలను బలంగా చెప్పగలమని వివరించారు.
నేతన్నలు, గీత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ అందుతున్న విధంగానే ఇతర వృత్తి కులాలకు కూడా 50 ఏళ్లకే పెన్షన్ అందించే అంశంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. యాదవులు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, ముదిరాజులు, బుద్ధిరాజులు తదితర వృత్తి ఆధారిత కులాల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో కుల సంఘాలు, కుల భవనాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, ముదిరాజ్ కుల ఆత్మగౌరవ భవనానికి ₹5 కోట్లు, ముదిరాజ్ కార్పొరేషన్‌కు ₹50 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. అన్ని కుల సంఘాలు తమ భవనాల నిర్మాణాన్ని ప్రారంభించుకునేలా సహకారం అందించాలని కోరారు. ఈ భవనాలు కేవలం సమావేశాలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విద్యార్థులకు వసతి, చదువు, పోటీ పరీక్షల సన్నద్ధతకు మార్గదర్శక కేంద్రాలుగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
ముదిరాజు సమాజం ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు మన జనాభా, మన సమస్యలు, మన హక్కుల గురించి మరింత ఐక్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కులాల మధ్య విభేదాలు కాకుండా పరస్పరం సమస్యలను పరిష్కరించుకుంటూ బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యాదవులు, గీత కార్మికులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు, ముదిరాజులు తదితర వృత్తి కులాల సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి వృత్తి అభివృద్ధి చెందేలా, ఆ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.