పెద్దపల్లి(రైట్స్ మీడియా): రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏఐకేఎంఎస్ ప్రథమ జిల్లా మహాసభను నిర్వహించారు. ఈ మహాసభకు కామ్రేడ్ ఎల్. భీమన్న అధ్యక్షత వహించారు. మహాసభకు ప్రారంభోపన్యాసకులుగా పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ బొంకూర్ లక్ష్మణ్ హాజరయ్యారు.
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం
⏩పెద్దపల్లిలో ఏఐకేఎంఎస్ ప్రథమ జిల్లా మహాసభ నిర్వహణ.. నూతన జిల్లా కమిటీ ఎన్నిక.. అధ్యక్షుడిగా ఎల్. భీమన్న
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి. భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకొస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పి. రవీందర్ మాట్లాడుతూ.. కౌలు రైతులకు హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ పెట్టుబడి సాయం తదితర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని కోరారు.
మహాసభలో రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెల్తురు సదానందం, మంచిర్యాల జిల్లా ఐఎఫ్‌టీయూ నాయకుడు బి. సుధాకర్, ఐఎఫ్‌టీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ డి. లచ్చన్న, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కే. విశ్వనాథ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
నూతన జిల్లా కమిటీ ఎన్నిక
మహాసభ అనంతరం ఏఐకేఎంఎస్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎల్. భీమన్న, ఉపాధ్యక్షుడిగా ఎన్. మైపాల్, ప్రధాన కార్యదర్శిగా పోచం, సహాయ కార్యదర్శిగా పి. పోశం, కోశాధికారిగా దెబ్బట రాజలింగం ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా తిరుపతి, బి. చంద్రయ్యలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ వారి హక్కుల సాధనకు కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.