Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

దేవరుప్పుల మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

అధికారులు–ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి.. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

దేవరుప్పుల మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Share Short Clip Download PDF

అధికారులు–ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి.. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

దేవరుప్పుల(రైట్స్ మీడియా): దేవరుప్పుల మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరుప్పుల మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో పాటు గ్రామాల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవరుప్పుల మండలంలోని గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్యుత్, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు వంటి కీలక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దేవరుప్పుల మండల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

దేవరుప్పుల మండలాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేయడం ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమీక్ష సమావేశంలో దేవరుప్పుల మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.