వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో శుక్రవారం భూముల రీ-సర్వేపై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, రికార్డులలో పారదర్శకత కోసమే రీ-సర్వే చేపడుతున్నాం: కలెక్టర్ డా.సత్యశారధ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ-సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదు విధానం, సర్వే సమయంలో భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రీ-సర్వే ద్వారా కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలపై గ్రామస్థులకు వివరంగా అవగాహన కల్పించారు.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం, రికార్డులలో పారదర్శకత కోసమే రీ-సర్వే చేపడుతున్నామని తెలిపారు. రీ-సర్వే ప్రక్రియలో ప్రతి రైతు, భూ యజమాని తప్పనిసరిగా సహకరించాలని, తమ భూములకు సంబంధించిన పట్టా, ఆధార్, ఇతర వివరాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
తమ భూ వివరాల్లో ఏవైనా తేడాలు, అభ్యంతరాలు ఉన్నట్లయితే వెంటనే సర్వే బృందం లేదా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.
ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఏడీ సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, నల్లబెల్లి తహసిల్దార్ కృష్ణా, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది, పెద్ద సంఖ్యలో గ్రామ రైతులు పాల్గొన్నారు.