Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
ప్రాతినిధ్యం

గ్రామాల్లో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, విక్రయాలు?..

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు!

గ్రామాల్లో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, విక్రయాలు?..
Share Short Clip Download PDF

వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా (నాటు సారా) తయారీ, విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని తండాలలో, మండలంలోని ఇల్లంద, నల్లబెల్లి, కట్రియాలా , రామోజీ కుమ్మరిగూడెం తండా, దివిటిపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో, పొలాల్లో గుడుంబా బట్టీలు పెట్టి భారీగా తయారు చేస్తున్నారు అని సమాచారం. బెల్లం, పటిక, ఇతర రసాయనాలతో తయారు చేస్తున్న ఈ సారాను తక్కువ ధరకు విక్రయిస్తుండడంతో కూలీలు, యువత దీనికి బానిసలవుతున్నారు.
క్వార్టర్ 150 రూపాయలు ఉంటే గుడుంబా ప్యాకెట్ 30-50 రూపాయలకే దొరుకుతోంది. ఉదయం నుండే మందుబాబులు బట్టీల వద్ద క్యూ కడుతున్నారు. గుడుంబా తాగి అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి.

ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుపై అనుమానాలు :

గ్రామాల్లో ఇంత విచ్చలవిడిగా గుడుంబా వ్యాపారం జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేయకపోవడం, చట్టరిత్యా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎక్సైజ్ అధికారులకు ప్రతి నెలా మామూళ్లు ముడుతున్నాయి. అందుకే వారు గుడుంబా బట్టీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫిర్యాదు చేసినా చూస్తాం, చేస్తాం అని తప్పించుకుంటున్నారు అని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్పందించి, వర్ధన్నపేట ఎక్సైజ్ అధికారులు మండలంలోని గుడుంబా బట్టీలపై దాడులు చేసి, తయారీదారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.