రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రోజున విద్యార్థినీ విద్యార్థులకు ఏకరూప దుస్తులను వరంగల్ ఇంటర్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డా.శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 430 జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి ఏకరూప దుస్తుల పంపిణీ అవుతున్నదని, వరంగల్ జిల్లాలో మొట్టమొదటి సారిగా ఇంటర్ విద్యార్థులకు ఉచిత యూనిఫాం పంపిణీ రాయపర్తి నుండి ప్రారంభం కావడం శుభసూచకమని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు నీలి రంగు ప్యాంట్, నేవీ బ్లూ షర్ట్ అందించడం వారి మధ్య దుస్తుల రూపంలో ఉండే బేధభావాలు దూరం అవుతాయని, అందరూ ఒక్కరీతిన కనిపించడం విద్యార్థుల ఐక్యతకు దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇంటర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తూ గతంలో నోట్ బుక్స్, షూ, బ్యాగులు ఇచ్చారని, ఇపుడు యూనిఫాం ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు భారం తగ్గనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయని అందులో మొత్తం 2704 విద్యార్థుల్లో 1562 మంది బాలురు, 1142 మంది బాలికలు ఉన్నారని వారందరికీ త్వరలోనే యూనిఫాంలను పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయకుమారి, లైబ్రేరియన్ సునీల్ రెడ్డి,రాయపర్తి ఎస్బిఐ మేనేజర్ రవి కుమార్, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఏకరూప దుస్తులతో విద్యార్థుల్లో ఐక్యత
వరంగల్ డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్
రాయపర్తి జూనియర్ కళాశాలలో ఏకరూప దుస్తుల పంపిణీ