విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మానేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్ లో, కే. హబ్ డైరెక్టర్ ఆచార్య టి. సవితా జ్యోత్స్న అద్యక్షతన కాకతీయ విశ్వవిద్యాలయంలోని కె-హబ్, హైదరాబాద్ టీ-హబ్ సహకారంతో నిర్వహిస్తున్న “స్టూడెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (SDP)” లో భాగంగా మూడో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యూహరచన, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుభవజ్ఞుడైన ఈ శిక్షణా కార్యక్రమానికి శిక్షకుడిగా వ్యవహరించారు. సంస్థలు తమ నిర్దేశిత లక్ష్యాలను సాధించడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. వ్యూహాత్మక సమన్వయం, విశ్లేషణాత్మక సమస్య పరిష్కారం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బిందు మాధవ్ శిక్షణలో భాగంగా విద్యార్థులు వివిధ ప్రాక్టికల్ వ్యాయామాలు, వాస్తవ పరిస్థితులకు సంబంధించిన సమస్యలపై చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. సంప్రదాయ ఉపన్యాస పద్ధతికి భిన్నంగా ఇంటరాక్టివ్ కార్యకలాపాల ద్వారా సంక్లిష్ట సమస్యలను విశ్లేషించడం, సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం, బృందంగా పనిచేయడం వంటి నైపుణ్యాలను అభ్యసించారు. వ్యూహాత్మక ఆలోచన, క్రమబద్ధమైన విశ్లేషణ సంస్థల విజయంపై చూపే ప్రభావాన్ని ప్రాక్టికల్ విధానంలో విద్యార్థులు తెలుసుకున్నారు. కార్యక్రమం ముగింపులో నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. విద్యార్థులు తమ విద్యా ప్రస్థానంతో పాటు భవిష్యత్ పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో వ్యూహాత్మక ఆలోచనా విధానాన్ని అన్వయించుకునేందుకు అవసరమైన ఆచరణాత్మక మార్గదర్శకాలను ఈ కార్యక్రమం అందించింది. కె-హబ్–టీ-హబ్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో కార్పొరేట్, నాయకత్వ నైపుణ్యాలను మరింత బలోపేతం చేయడానికి కృషి కొనసాగుతోంది అని, రుసా నోడల్ ఆఫీసర్ ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి తో కే హబ్ జాయింట్ డైరెక్టర్ లు సిద్ధార్థ, బొల్లం కిరణ్ పాల్గొన్నారు.