రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పునరావాసం –పునరావాస పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్), అటవీ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలను పరిష్కరించాలి: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల పెండింగ్ సమస్యలపై సమీక్షించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసి, నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూసేకరణ, పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్ చెల్లింపులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. భూసేకరణను చీఫ్ ఇంజినీర్లు ఒక సవాల్‌గా తీసుకుని యుద్ధప్రాతిపదికన పనిచేయాలని మంత్రి సూచించారు. రెవెన్యూఅధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించిన టోకెన్లను త్వరితగతిన క్లియర్ చేయడంతో పాటు పెండింగ్ అవార్డులను వీలైనంత త్వరగా పాస్ చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ల పీడీ ఖాతాలకు చేరిన నిధులు అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయమైన పరిహారం అందించి భూమిని సకాలంలో సేకరించాలని మంత్రి సూచించారు. భూసేకరణ ప్రక్రియలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి స్థానిక సమస్యలను పరిష్కరించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ సమస్యల్లో ఎలాంటి అవరోధాలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని, అవసరమైన అంశాలను తన దృష్టికి నేరుగా తీసుకొని రావాలని కలెక్టర్లకు మంత్రి తెలిపారు. కలెక్టర్లు నీటిపారుదల శాఖ కార్యదర్శితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ సిఇ వాసంతి, ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.