బహుజన రాజ్య స్థాపన, సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ఆయన పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. 17వ శతాబ్దంలోనే సామాజిక అసమానతలు, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యంగా పోరాడారని కొనియాడారు. సాధారణ గౌడ కుటుంబంలో జన్మించిన ఆయన తన ధైర్యసాహసాలు, నాయకత్వ పటిమతో సామాన్య ప్రజలను ఏకం చేసి బలమైన సైన్యాన్ని నిర్మించారని తెలిపారు.
కొద్దిమంది అనుచరులతో ప్రారంభమైన ఆయన పోరాటం వేలాది మంది వీరులతో కూడిన శక్తివంతమైన ఉద్యమంగా మారిందని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన సాహసం, పట్టుదల, నాయకత్వ పటిమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయని అన్నారు. సామాజిక సమానత్వం కోసం మహనీయుడి పోరాటం సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు లభించాలనే లక్ష్యంతో పాపన్న గౌడ్ చేసిన పోరాటం ఎంతో గొప్పదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గౌడ సంఘం, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఎల్లమ్మ దేవాలయం ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ధైర్యం, ఆత్మగౌరవం వంటి విలువలను ప్రజల్లో పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. యువత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను తెలుసుకోవాలని, ఆయన పోరాట పటిమ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయన సేవలు, పోరాటాలకు తగిన గౌరవాన్ని అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. మహనీయుల చరిత్రను భావితరాలకు అందించేందుకు, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటువంటి అధికారిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, బిసి సంక్షేమ అధికారి ఇందిర, ఎక్సైజ్ ఈ ఎస్ కిరణ్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు గాజర్ల అశోక్, కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల నాయకులు,
తదితరులు పాల్గొన్నారు.
యువత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను తెలుసుకోవాలి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
బహుజన రాజ్య స్థాపన, సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.