తెలంగాణ ప్రాంత బహుజన సామాజిక వర్గాల విముక్తి కొరకు పోరాడిన యోధులు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కొరకు పాపన్న గౌడ్ శ్రమించాడని, అటువంటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులానికే కాకుండా పేదల పక్షాన నిలిచిన వ్యక్తి అని అన్నారు. బహుజన చక్రవర్తి పాపన్నను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేద, బడుగు బలహీనవర్గాలపై జరిగిన అన్యాయాల పైన పోరాటం చేసిన మహనీ యుడని కొనియాడారు. సాధారణ కుటుంబంలో జన్మించి గీత కార్మికుడిగా కొనసాగిన తన ప్రస్థానంలో అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు పాపన్న గౌడ్ అని అన్నారు.
పాపన్న గౌడ్ విగ్రహ స్థల సేకరణ కొరకు ఉమ్మడి జిల్లా గౌడ్ కమిటీ సభ్యులు నిరంతరం కృషి చేయాలని, నగరంలో పాపన్న గౌడ్ విగ్రహానికి స్థల సేకరణ కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పాపన్న గౌడ్ భారీ విగ్రహ ఆవిష్కరణ కోసం కృషి చేస్తానన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు,1వ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము, కేయూ పాలకమండలి సభ్యులు చిర్ర రాజు, జిల్లా గౌడ్ కమిటీ సభ్యులు,జిల్లా ప్రముఖులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం: వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు