జీడబ్ల్యూఎంసీ, 13 అక్టోబర్ 2026(రైట్స్ మీడియా): జనాభా గణన రెండో దశను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి సంబంధిత నిబంధనలు, ప్రశ్నావళి, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని బల్దియా ప్రత్యేకాధికారి/హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు.

మంగళవారం గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో నగర పరిధి లోని ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనాభా గణన రెండో దశపై అక్టోబర్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ శిక్షణలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (HLO) బ్లాకులను ఎన్యుమరేషన్ బ్లాకులుగా మార్చే విధానం, వెబ్ పోర్టల్ ద్వారా చేపట్టాల్సిన సాంకేతిక ప్రక్రియలు, ఎన్యుమరేషన్ బ్లాకుల కేటాయింపు, జనాభా గణనలో ఎవరూ మినహాయింపునకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

అలాగే, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించాల్సిన వివరాలతో పాటు మొదటిదశలో భాగం గా ఏమైనా లోపాలు సవరించడం తో పాటు ప్రశ్నావళిలోని కీలక అంశాలు, జనాభా వివరాల్లో లోపాలు లేదా వ్యత్యాసాలు ఉన్నప్పుడు వాటిని గుర్తించి సరిచేసే విధానాలపై అవగాహన కల్పించారు. కేటాయించిన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి వివరాలు సమగ్రంగా నమోదు అయ్యేలా చూడటంతో పాటు, జనాభా గణనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సాంకేతిక వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సెన్సస్ విభాగం హైదరాబాద్ నుండి సీహెచ్ సతీష్, జూనియర్ టెక్నికల్ సూపర్ వైజర్ ప్రశాంత్ పాల్గొని, వెబ్ పోర్టల్ వినియోగం, బ్లాకుల మార్పులు, జనాభా వివరాల నమోదు తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా, బల్దియా ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తదితర అధికారులు పాల్గొన్నారు.