వ్యకి, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, టీచర్‌కు ప్రత్యామ్నాయం లేదని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయ విద్యా కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్ అద్యక్షతన నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ, మారుతున్న కాలంలో విద్యార్థుల మనస్తత్వం, వైఖరిలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమను తాము నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. కృత్రిమ మేధ (AI) విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో సాంకేతికత ఉపాధ్యాయుడికి సహాయకారిగా ఉండవచ్చని, అయితే విద్యార్థుల్లో విలువలు, మానవీయత, బాధ్యత, మంచి పౌరసత్వం వంటి లక్షణాలను పెంపొందించి, వారిని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడి పాత్రకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు.
ఈ సందర్భంగా ఓఎస్డీ, ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, దేశ జనాభాలో సుమారు 33 శాతం యువత ఉందని, వారిని సమర్థవంతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని పేర్కొంటూ, ఒక ఉపాధ్యాయుడే అనేక రంగాలకు చెందిన నిపుణులైన ఉపాధ్యాయులను తీర్చిదిద్దగలరని అన్నారు.
ఈ సందర్భంగా కళాశాల పూర్వపు ఆచార్యలు చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు.
డీన్ ఆచార్య ఎన్. రామనాథ్ కిషన్ మాట్లాడుతూ, కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా వినియోగిస్తూ జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఉపాధ్యాయుల వివిధ పాత్రలను వివరించారు. పాలకమండలి సభ్యులు డాక్టర్ చిర్రా రాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమాజానికి దిశానిర్దేశకులని, మానవ విలువలను పెంపొందించడంలో వారికి గురుతర బాధ్యత ఉందన్నారు. సహాయ రిజిస్ట్రార్ డాక్టర్ కోలా శంకర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని, కొనలేనివని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని శ్రీనివాస్ కళాశాల ప్రగతిని వివరించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు.
జర్నలిజం విభాగ అధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ తో పాటు కళాశాల బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు చాల ఉత్సాహంగా పాల్గొన్నారు.