Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ధాన్యం తరలింపు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి.

ధాన్యం తరలింపు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి
Share Short Clip Download PDF

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం తరలింపు ప్రక్రియపై పౌర సరఫరాలు, సహకార శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో అదనపు కలెక్టర్ సమావేశం.

ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి పౌర సరఫరాలు, సహకార శాఖల అధికారులు, ధాన్యం కొనుగోలు కాంట్రాక్టర్లను ఆదేశించారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన దాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ పై జిల్లా పౌర సరఫరాల శాఖ, ధాన్యం కాంట్రాక్టర్లతో సమావేశాన్ని అదనపు కలెక్టర్ నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం తరలించే వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం తరలింపులో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్టోరేజ్ పాయింట్లలో ధాన్యం నిల్వ అవసరాలకు ఉపయోగపడే స్థలాలను సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సీజన్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల డ్రైవర్ల సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపయోగంలో లేని ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్ళను స్టోరేజ్ పాయింట్లుగా వినియోగించుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహేందర్, జిల్లా సహకార అధికారి మోహన్, సివిల్ సప్లై డీటీలు భద్రు నాయక్, నాగేంద్ర ప్రసాద్, భాస్కర్ రెడ్డి, ధాన్యం కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.