గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న గణనాథుల నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని అధ్యక్షతన మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు నిమజ్జన ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవడంతో ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌లో ప్రస్తుతం నీటి లభ్యత లేకపోవడంతో నిమజ్జన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
నిమజ్జనానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడంపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు. కెనాల్‌లో నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఆ నీరు హుజురాబాద్ నిమజ్జన ప్రాంతం వరకు చేరుతుందా లేదా అనే అంశంపై కొంత సందిగ్ధత నెలకొంది. ఒకవేళ కెనాల్‌లోకి నీరు చేరకపోతే ప్రత్యామ్నాయంగా ఇసుక బస్తాలతో నీటిని నిల్వ చేసి గణనాథుల నిమజ్జనానికి అనువుగా ఏర్పాట్లు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.