Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

స్ఫూర్తి ప్రధాత వీరనారి చాకలి ఐలమ్మ

కేయూ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కే. ప్రతాప్‌ రెడ్డి.

స్ఫూర్తి ప్రధాత వీరనారి చాకలి ఐలమ్మ
Share Short Clip Download PDF

భూమి కోసం దొరలు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి, తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి ప్రదాత అని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య కే. ప్రతాప్‌ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య వి. రామచంద్రం అధ్యక్షతన పరిపాలన భవన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమానికి వైస్‌ఛాన్సలర్‌ ముఖ్య అతిథిగా హాజరై, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా వైస్‌ఛాన్సలర్‌ మాట్లాడుతూ..

భూమి కోసం దొరలు, జమీందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఐలమ్మ ధైర్యంగా తిరుగుబాటు చేశారని తెలిపారు. తన పోరాటంలో కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ వెనుకడుగు వేయకుండా పోరాట స్ఫూర్తిని చాటారని, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆమెకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. ఆమె జీవితం నేటి తరానికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక న్యాయం కోసం పోరాడే స్ఫూర్తిని అందిస్తుందని అన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య వి. రామచంద్రం అధ్యక్షోపన్యాసం చేస్తూ, వీరనారి చాకలి ఐలమ్మ పేరు మీద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం గొప్ప విషయమని అన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని, నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య బి. సురేష్‌ లాల్, డాక్టర్‌ ఎన్. సుదర్శన్, డాక్టర్‌ చిర్రా రాజుతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.