Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

--రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం
Share Short Clip Download PDF

పేదల సంక్షేమంతో పాటు కార్పోరేషన్ లో కలిసిన విలీన గ్రామాల సమగ్ర అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

బుధవారం ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని ఒకట డివిజన్ కైకొండాయిగూడెం, 59వ డివిజన్ దానావాయి గూడెంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

బుధవారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ కైకొండాయిగూడెంలో సుడా నిధులు రూ.100 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, అనంతరం 59వ డివిజన్‌లో సుడా నిధులు రూ.112.25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా మంత్రి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిందని, ఈ కాలంలో ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన రెండున్నర సంవత్సరాల్లో కూడా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి, పేదింటి గుమ్మానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను చేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

కైకొండాయిగూడెం 1వ డివిజన్‌లో ఈరోజు శంకుస్థాపన చేసిన రూ.కోటి పనులతో కలిపి ఇప్పటివరకు సుమారు రూ.12.83 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంజూరు చేసి, అనేక పనులను పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

1వ డివిజన్ పరిధి విస్తృతంగా ఉండటంతో ఇంకా అనేక ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల అవసరం ఉందని తెలిపారు. డివిజన్‌లో మిగిలిన రోడ్ల అభివృద్ధికి అవసరమైన నిధులను దశలవారీగా కేటాయించి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు డైట్ ఛార్జీలు పెంచడంతో పాటు, విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆర్థిక సహాయం పెంచామని చెప్పారు. పేద పిల్లలు చదువులో ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను, రెండో విడతలో మరో రెండున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

అర్హతే ప్రామాణికంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, కులం, మతం, రాజకీయాలకు ఎలాంటి తావు ఉండదని పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవంతో జీవించేందుకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు.

ఇప్పటికే చేపట్టిన సీసీ రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు, మిగిలిన ప్రాంతాల్లో అవసరమైన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ

ప్రజల మౌళిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ జయచంద్ర, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.