ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, జిల్లాలో ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం
శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గ్రౌండింగ్ నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాను గృహ నిర్మాణంలో ఆదర్శంగా నిలపాలంటే మంజూరైన ఇళ్లను వేగంగా గ్రౌండింగ్ చేసి, నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లు ఏయే దశల్లో ఉన్నాయో మండలాల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విచారణ, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపిడివోలను, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్షకు తావులేకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హులను గుర్తించాలని స్పష్టం చేశారు.. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వ్యత్యాసం చూపించవద్దని అధికారులకు సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ..
బిల్లుల చెల్లింపులో ముందుండాలని ఆదేశించారు. నిర్మాణ పనులకు సంబంధించిన ఎం.బీ. నమోదులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. బిల్లుల చెల్లింపులో భూపాలపల్లి జిల్లా ముందువరుసలో ఉండేలా అధికారులు పనిచేయాలని సూచించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనం అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇళ్ళు నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి వేగవంతం చేయాలని ఆదేశించారు. కాటారం డివిజన్ పరిధిలో పురోగతి చాలా తక్కువగా ఉందని, వేగం పెంచాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, అన్ని మండలాల ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు తధితరులు పాల్గొన్నారు.