రైట్స్ మీడియా - ప్రాతినిధ్యం డెస్క్:
స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడిచినా, "భారత ప్రజలమైన మేము..." అంటూ ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య మాతృ చట్టాన్ని (Constitution of India) మనకు మేమే సమర్పించుకుని ఏళ్లు దాటుతున్నా... నేటికీ సగటు భారతీయుడికి రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులు, విధులు, రక్షణలపై పరిపూర్ణ అవగాహన లేకపోవడం అత్యంత విచారకరం. ప్రతీ పౌరుడికి నిత్య జీవితంలో రక్షణ కల్పించే బ్రహ్మాస్త్రం, దేశ సౌధానికి పునాది అయిన భారత రాజ్యాంగం... ఇంకా సామాన్యుడికి అర్థంకాని "తెరిచిన రహస్య పుస్తకం"గా (Open Secret Book) మిగిలిపోవడానికి గల కారణాలేంటి? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ఆచరణాత్మక చర్యలేంటి? అనే అంశంపై రైట్స్ మీడియా సొసైటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తున్న స్పష్టమైన కార్యాచరణ ప్రాతినిధ్యం (Official Representation) మరియు ప్రత్యేక పరిశోధనాత్మక కథనం.
హక్కుల పట్ల అవగాహన లేకపోవడమే దోపిడీకి మూలం:
దేశంలో చట్టాల ప్రాథమిక సూత్రాలు లేదా రాజ్యాంగబద్ధమైన పౌర హక్కులు (Fundamental Rights) తెలియకపోవడం వల్లే సామాన్య పౌరుడు స్థానిక పాలనా వ్యవస్థల్లో, పోలీస్ స్టేషన్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు సమాజంలో అనేక రకాల వేధింపులకు, దోపిడీకి గురవుతున్నాడు.
⏩ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)
⏩ఆర్టికల్ 19 (స్వేచ్ఛగా భావప్రకటన చేసే హక్కు)
⏩ఆర్టికల్ 21 (జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ)
⏩ఆర్టికల్ 32 (రాజ్యాంగ పరిహార హక్కు)
వంటి ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరి ఆత్మగౌరవానికి రక్షణ కవచాలు. కానీ, వీటి ప్రాముఖ్యత పాఠశాల స్థాయి నుంచి పౌరుడికి చేరకపోవడం వల్ల రాజ్యాంగం కేవలం న్యాయవాదులు, న్యాయమూర్తులు, పాలకులకు, ఉన్నతాధికారులకు మాత్రమే పరిమితమైన ఒక గ్రంథంగా మిగిలిపోయింది!..
ఆచరణాత్మక పరిష్కారాలు – ప్రభుత్వాలు చేపట్టాల్సిన తక్షణ బాధ్యతలు:
రాజ్యాంగాన్ని కేవలం ఒక పుస్తకంగా కాకుండా ప్రతి భారతీయుడి ఆలోచనా విధానంగా మార్చడానికి 'రైట్స్ మీడియా సొసైటీ' ఈ క్రింది విప్లవాత్మక ఆచరణాత్మక సిఫార్సులను ప్రభుత్వాల ముందుకు ఉంచుతోంది...
• పదవ తరగతి / 18 ఏళ్ల లోపే తప్పనిసరి సబ్జెక్ట్గా బోధన:
ఒక వ్యక్తికి 18 ఏళ్లు పూర్తయ్యే లోపు (లేదా పదవ తరగతి పూర్తయ్యే లోపే) రాజ్యాంగ మౌలిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, విధులు మరియు పౌర చట్టాలపై సంపూర్ణ పట్టు సాధించేలా విద్యా వ్యవస్థలో "భారత రాజ్యాంగం"ను ఒక ప్రత్యేక, తప్పనిసరి సబ్జెక్ట్గా (Compulsory Academic Subject) చేర్చాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం విధిగా మారాలి.
రాజ్యాంగ ముద్రణ – ప్రతి ఇంటికీ ఉచిత పంపిణీ:
ప్రభుత్వాలు ఓటర్ల జాబితాలు, ప్రజా పత్రాలను ముద్రించినట్లే... భారత రాజ్యాంగాన్ని మాతృభాషల్లో సులువైన శైలిలో ముద్రించి, ప్రతి భారతీయుడికీ, ప్రతి ఇంటికీ పూర్తి ఉచితంగా (Free Distribution) అందించే బాధ్యతను ప్రభుత్వాలే స్వీకరించాలి.
• భారత రాజ్యాంగ విద్య బోర్డు లేదా కమీషన్ ఏర్పాటు:
భారతీయులందరికీ చట్టపరమైన, రాజ్యాంగపరమైన విజ్ఞానాన్ని అందించడానికి నిరంతరం పనిచేసేలా "ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లిటరసీ కమీషన్" (Constitutional Literacy Commission) లేదా ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి.
• పౌర సేవలకు 'రాజ్యాంగ ప్రాథమిక పరిజ్ఞానం' అనుసంధానం:
ఓటరు గుర్తింపు కార్డు (Voter ID), డ్రైవింగ్ లైసెన్స్, లేదా కొత్త పాస్పోర్ట్ పొందే సమయంలో పౌరులకు రాజ్యాంగ ప్రాథమిక హక్కులు మరియు విధులకు సంబంధించిన కనీస అవగాహనను పరీక్షించే డిజిటల్ ఓరియంటేషన్ను ప్రవేశపెట్టాలి.
• ప్రభుత్వ ఉద్యోగులకు నిర్బంధ రాజ్యాంగ ఓరియంటేషన్:
సర్వీసులోకి వచ్చే ప్రతీ ప్రభుత్వ అధికారి, ఉద్యోగి, పోలీస్ సిబ్బంది ప్రజా హక్కులకు భంగం వాటిల్లకుండా, రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించేలా క్రమం తప్పకుండా ప్రామాణిక శిక్షణా కోర్సులు (Refresher Courses) నిర్వహించాలి.
'రైట్స్ మీడియా' కార్యాచరణ:
జర్నలిజం కోడ్ ఆఫ్ ఎథిక్స్ (Code of Ethics) మరియు IT Rules 2021 (Rule 18) నిబంధనలకు లోబడి పనిచేస్తున్న రైట్స్ మీడియా సొసైటీ, ఇకపై నిరంతరం పౌరులలో రాజ్యాంగబద్ధమైన హక్కులు, చట్టపరమైన అవగాహన పెంచేందుకు "లీగల్ డెస్క్ (Legal Desk)" ద్వారా ప్రత్యేక విశ్లేషణలు, ప్రామాణిక కథనాలు మరియు ప్రభుత్వ యంత్రాంగానికి అధికారిక నివేదికలను నిరంతరం అందిస్తుంది.
"బాధ్యత కలిగిన పౌరులే ప్రజాస్వామ్యానికి నిజమైన రక్షణ. ఆ పౌరులకు రాజ్యాంగమే అసలైన శక్తి!"
– తాళ్ళపల్లి తిరుపతి (తిరువార్)
ఫౌండర్ ప్రెసిడెంట్ & పబ్లిషర్, రైట్స్ మీడియా సొసైటీ