Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల నేపథ్యంలో మిగిలిన రోడ్ల పనులకు తాత్కాలిక విరామం: ఎమ్మెల్యే నాయిని

⏩పనిలేని పసలేని నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో పశ్చిమ ప్రజలు లేరు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల నేపథ్యంలో మిగిలిన రోడ్ల పనులకు తాత్కాలిక విరామం: ఎమ్మెల్యే నాయిని
Share Short Clip Download PDF

⏩5వ డివిజన్ రెడ్డి కాలనీలో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

హనుమకొండ(రైట్స్ మీడియా): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నిర్ణీత గడువులో పూర్తి చేయిస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 5వ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ప్రతిరోజూ రెండు డివిజన్లలో రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేస్తూ, ప్రారంభించిన పనులకు కాంట్రాక్టర్లు, అధికారులకు స్పష్టమైన టైం బాండ్ విధిస్తున్నామని తెలిపారు. నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.ఏ డివిజన్‌లో ఎవరు ఉన్నారు, ఏ పార్టీకి చెందిన వారు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇప్పటివరకు చేపట్టిన రోడ్డు పనుల్లో 80 నుంచి 85 శాతం వరకు పూర్తయ్యాయి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మిగిలిన రోడ్ల పనుల్లో కొంత భాగాన్ని ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వరంగల్ నగరంలో భారీ స్థాయిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త రోడ్లు వేసి, కొద్ది కాలానికే డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్ల కోసం వాటిని మళ్లీ తవ్వాల్సిన పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వరంగల్ నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ముందుకు వస్తున్నాయని, టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెండు మూడు నెలల ఆలస్యాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి పనులపై విమర్శలు చేసే వారు ముందుగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల మధ్య జరుగుతున్న అభివృద్ధి, స్థానికంగా పూర్తి చేసిన పనులే తమ పనితీరుకు సమాధానమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.