విజయవాడ (రైట్స్ మీడియా):
విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహించిన ‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాలనా సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ యంత్రాంగ నైపుణ్యాల పెంపుదలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
టెక్నాలజీతోనే వేగవంతమైన పాలన, నాణ్యమైన సేవలు: సీఎం చంద్రబాబు నాయుడు
⏩ విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహించిన ‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్ లో పాల్గొని ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్య అంశాలు:
➤ అభివృద్ధికి రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకం:
ఏఐ లాంటి అధునాతన టెక్నాలజీ, అపారమైన అవకాశాలు, యువత ఆకాంక్షలు మన ముందే ఉన్నాయని, ప్రజల ఆకాంక్షలను పాలనా వ్యవస్థలు ఎంతమేరకు తీర్చగలవన్నదే ప్రధానాంశమని స్పష్టం చేశారు. రాబోయే 20 ఏళ్లు భారత్ అభివృద్ధికి అత్యంత కీలకమైన సమయమని, ఈ కాలంలోనే మన వ్యవస్థలు విప్లవాత్మక మార్పులు సంతరించుకోవాలని పిలుపునిచ్చారు.
➤ కెపాసిటీ బిల్డింగ్‌కు ప్రధాని మోదీ నిదర్శనం:
రైల్వే స్టేషన్‌లో చాయ్ విక్రేత స్థాయి నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ కెపాసిటీ బిల్డింగ్‌కు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏపీకి చెందిన ఒక ఉపాధ్యాయురాలు కూడా ఈ శిక్షణ ద్వారానే వేదికపై మాట్లాడగలిగారని తెలిపారు.
➤ ఐగాట్ - మిషన్ కర్మయోగి:
భారత్‌లోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాని మోదీ ఐగాట్-మిషన్ కర్మయోగిని తీసుకొచ్చారని, రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా నిరంతరం సామర్థ్యాలు పెంచుకున్నప్పుడే నాణ్యమైన సేవలు అందుతాయని చెప్పారు.
➤ చైనా ప్రగతి & అంతర్జాతీయంగా భారతీయుల నైపుణ్యాలు:
1978లో సామర్థ్యాల పెంపును ప్రారంభించిన చైనా కొన్ని దశాబ్దాల్లోనే ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిందని, అదే తరహా వనరులు ఉన్న మనం ఎందుకు వెనుకబడ్డామో బేరీజు వేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రగామి సంస్థలకు భారతీయులే సారథ్యం వహిస్తున్నారని గుర్తుచేశారు.
➤ ఐటీ నుంచి ఏఐ కాలానికి మారాలి:
గతంలో ఐటీ విప్లవం వచ్చిందని, ఇప్పుడు ఏఐ కాలం నడుస్తోందని, దానికి అనుగుణంగా మనం మారాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రగతిని నిరోధించే అనవసర నిబంధనలను సులభతరం చేసే 'జన్ విశ్వాస్' సంస్కరణలు ఇప్పుడు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.
➤ రియల్ టైమ్ గవర్నెన్స్ - ఇ-ఫైళ్ల విధానం:
రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా లేక్, ఇ-ఫైళ్ల విధానం ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, పౌరసేవల నాణ్యతను, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను (KPI) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.
➤ 2 కోట్ల కోర్సులు పూర్తి చేసిన ఏపీ యంత్రాంగానికి అభినందనలు:
ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా 2 కోట్ల కోర్సులను పూర్తి చేసి ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం అభినందించారు.
➤ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి:
ప్రకృతి విపత్తులు, పండుగలు, ఇతర కార్యక్రమాల్లో కుటుంబాలను సైతం పక్కన పెట్టి ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని, వారి సామర్థ్యాలను పెంచేందుకే ఈ శిక్షణ కార్యక్రమాలు అని తెలిపారు. రీల్స్ చూడటానికి కంటే కెపాసిటీ బిల్డింగ్ కోసం సమయం వెచ్చిస్తే వ్యక్తిగత నైపుణ్యాలు పెరుగుతాయని హితవు పలికారు.
➤ భవిష్యత్ ప్రణాళిక:
ప్రభుత్వ శాఖల మధ్య నిరంతర సమాచార పంపిణీ జరగాలని, సమస్య సంక్షోభంగా మారకముందే గుర్తించి పరిష్కరించేలా నైపుణ్యాలు పెరగాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి దిశగా యంత్రాంగం సమాయత్తం కావాలని, P4 (Public Private People Partnership) వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలు పెంచవచ్చని తెలిపారు.
గతంలోనే ఉమ్మడి ఏపీలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ద్వారా ఉద్యోగుల సామర్థ్యాలను పెంచే కృషి చేశామని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో కెపాసిటీ బిల్డింగ్ కోసం విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు సంస్థల సహకారం కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ వర్క్‌షాప్‌కు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటి బిల్డింగ్‌లో అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో రాష్ట్ర అధికారులు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్ డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలపర్తి వెంకటేశ్వరరావుకు అవార్డును అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన కర్ణాటక, మూడో స్థానంలో ఒడిశా రాష్ట్రాలకు కూడా సీఎం చంద్రబాబు అవార్డులు అందించారు.