హనుమకొండ, అక్టోబర్ 8(రైట్స్ మీడియా): మానవ సంబంధాలు ఎలా విధ్వంసమవుతున్నాయో విద్యార్థులు ఆలోచించాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, విశిష్ట విద్యావేత్త, సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం సెనెట్ హాల్‌లో అక్టోబర్ 8న ఉదయం వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన డాక్టర్ కే. బాలగోపాల్ 16వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో బాలగోపాల్ చిత్ర పటానికి పులమలు వేసి, నివాళి అర్పించి అనంతరం ప్రసంగిస్తూ - ప్రొఫెసర్ జి. హరగోపాల్ బాలగోపాల్ రచనల ప్రాసంగికత పై ప్రధాన వక్తగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, పరిశోధకులు, బోధనా, బోధనేతర సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్ కే. బాలగోపాల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రొఫెసర్ హరగోపాల్ కొనియాడారు. విలువలు తరతరాలకు అందాల్సి ఉండగా, ప్రస్తుత సమాజంలో అవి క్రమంగా క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ అభివృద్ధిలో విలువలు కీలకమని, అవి నాగరికతలో అంతర్భాగమని పేర్కొన్నారు. విలువలను వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా బాలగోపాల్ తన రచనలు, ఆలోచనల ద్వారా స్పష్టమైన మార్గాన్ని చూపారని అన్నారు. న్యాయ భావన బాలగోపాల్ ఆలోచనా స్ఫూర్తి అని పేర్కొంటూ, ఆయన ప్రతిపాదించిన సమానత్వ భావనను సమాజంలో వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. స్త్రీ, పురుషులు సమానమేనన్న భావనను బాలగోపాల్ బలంగా విశ్వసించారని తెలిపారు. విలువలు, మానవ సంబంధాలు, సామాజిక న్యాయం వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారుతున్న కాలంలో బాలగోపాల్ రచనలు సమాజానికి దిక్సూచి వంటివని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హక్కులు కేవలం వ్యక్తి కేంద్రంగా కాకుండా సమాజ కేంద్రంగా కూడా ఉండాలని, మానవ హక్కులకు సార్వజనీన ప్రమాణాలు అవసరమని వివరించారు. సిద్ధాంతం, ఆచరణ రెండింటి మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

విద్యార్థులు బాలగోపాల్ విలువలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజానికి తాను ఏమి చేయగలననే ఆలోచన ప్రతి విద్యార్థిలో ఉండాలని సూచించారు. డాక్టర్ బాలగోపాల్‌ను పూర్తిస్థాయి మానవ హక్కుల కార్యకర్తగా అభివర్ణించిన ప్రొఫెసర్ హరగోపాల్, సమాజ శ్రేయస్సు కోసం ఆయన తన వృత్తిపరమైన జీవితాన్ని సైతం పక్కన పెట్టి పనిచేశారని గుర్తుచేశారు. రాజ్యం కూడా తన బాధ్యతలకు అనుగుణంగా ప్రమాణాలను పాటించాలని బాలగోపాల్ నిరంతరం కోరుకున్నారని తెలిపారు. సమాజంలో చైతన్యం పెరగాలని, పాత భావజాలాలను అధిగమించి సమకాలీన ఆలోచనలను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. బాలగోపాల్ ఆలోచనలు, రచనలు నేటి తరానికి కూడా ఎంతో ప్రాసంగికమని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు.

మానవ హక్కుల పరిరక్షణకు నాలుగు దశాబ్దాల క్రితమే బాలగోపాల్ అంకురార్పణ చేశారు తాల్లా రోహిత్ - మానవ హక్కుల పరిరక్షణ కోసం నాలుగు దశాబ్దాల క్రితమే డాక్టర్ కే. బాలగోపాల్ అంకురార్పణ చేశారని హైదరాబాద్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్, హెచ్‌ఆర్‌ఎఫ్ కార్యకర్త తాల్లా రోహిత్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 8న నిర్వహించిన డాక్టర్ కే. బాలగోపాల్ 16వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో బాలగోపాల్ రచనల ప్రాసంగికత పై ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. డాక్టర్ బాలగోపాల్ సంక్షేమం, అభివృద్ధిని విభిన్న కోణాల్లో విశ్లేషించారని రోహిత్ తెలిపారు. సంక్షేమాన్ని కేవలం ప్రభుత్వ వ్యయంగా చూడకుండా, అభివృద్ధి దృక్పథంతో చూడాలని బాలగోపాల్ స్పష్టం చేశారని అన్నారు. సంక్షేమం భిక్ష కాదని, అది ప్రతి పౌరుడి హక్కు అని బాలగోపాల్ తన రచనల లో చెప్పేవారని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అసమానతలు, అణచివేతలను గుర్తించి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు.

నేటి తరం బాలగోపాల్ ఆలోచనలు, రచనలను మరింతగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన రచనలు నేటికీ పాఠకులను ప్రభావితం చేస్తూ, కొత్త తరంతో అనుసంధానమవుతున్నాయని తెలిపారు. బాలగోపాల్ రచించిన పుస్తకాలు ఇప్పటికీ జనాదరణ పొందుతున్నాయని, నేటి విద్యార్థి లోకం ఆయన రచనలను చదివి, వాటిలోని సామాజిక దృక్పథాన్ని అర్థం చేసుకోవాలని రోహిత్ సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల సందర్భంలో నిర్వాసితుల సమస్యలను, వారి జీవన పరిస్థితులను బాలగోపాల్ లోతుగా అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి ప్రక్రియలో ప్రజల హక్కులు, జీవనోపాధి, గౌరవం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని బాలగోపాల్ తన రచనలు, ఆచరణ ద్వారా చాటి చెప్పారని తెలిపారు.

న్యాక్ మాజీ సంచాలకులు ఆచార్య వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ... మానవ హక్కుల కార్యకర్త, అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శప్రాయుడు బాలగోపాల్ అన్నారు. అయన స్మృత్యర్ధం పర్స్పెక్టివ్స్ అనే సంస్థ ను ప్రారంభించి అయన బావజల వ్యాప్తి చేస్తున్నట్టు, అయన రచనలు. ప్రసంగాలు పుస్తక రూపం లో తీసుకోని వస్తునట్టు తెలిపారు, అంతే కాకుండా విశ్వవిద్యాలయం నిరంతరం 16 స్మారక ఉపన్యాసాలు నిర్వహణ చేసినందుకు కొనియాడారు.

కేయూ వీసి ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి తన అధ్యక్ష ప్రసంగం లో... బాలగోపాల్ నేటి తరానికి ఆదర్శప్రాయుడు అని, అయన పేరున విశ్వవిద్యాలయం లో ఇప్పటి వరకు 16 స్మారక ఉపన్యాసాలు నిర్వహించి దేశం లోనే ప్రముఖ వ్యక్తులు, సంస్థ ల నుంచి పిలిపించి ఉపన్యాస లు నిర్వహించినట్టు, ఇతర స్మారక ఉపన్యాస లు కుడా అదే విధంగా నిర్వహిస్తున్నట్టు, విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలి అన్నారు.

రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం మాట్లాడుతూ... హక్కుల యోధులు బాలగోపాల్ విశ్వవిద్యాలయ పూర్వపు ఆచార్యులు అయినందుకు విశ్వవిద్యాలయ గర్విస్తుంది అన్నారు. గణిత శాస్త్ర వేత్తగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞ శాలి అన్నారు, ఈ సందర్భంగా నిత్య జీవితం లో మానవ హక్కులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు, బాల గోపాల్ సతి మణి వసంత లక్ష్మి తో పటు పలువురు అతిధులు పాల్గొన్నారు.

ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్ల్లాల సంయోజకులు గా వ్యవహరించారు. కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టర్ కే. బాలగోపాల్ పేరిట నిరంతరం 16 స్మారక ఉపన్యాసాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. సందర్భంగా “నిత్య జీవితంలో మానవ హక్కులు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కే. బాలగోపాల్ సతీమణి వసంత లక్ష్మితో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.