Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

ప్రభుత్వ భూముల వివరాలతో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలతో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ను రూపొందించాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

ప్రభుత్వ భూముల వివరాలతో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్
Share Short Clip Download PDF

రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలతో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ను రూపొందించాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో యాక్షన్ టేకెన్ రిపోర్టులపై చర్చ సందర్భంగా పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి, వాటి పూర్తి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని సీఎం స్పష్టం చేశారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వ భూములపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఏళ్లుగా వినియోగంలో లేని భూములను గుర్తించి, వాటి వివరాలను కామన్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్లోకి తీసుకురావాలని సూచించారు.

జిల్లాలు, శాఖల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఏ ప్రభుత్వ శాఖకు భూమి అవసరమైనా ఈ పోర్టల్ ద్వారా కేటాయించే విధానం ఉండాలని అన్నారు. భూమి కొరత అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు మంజూరైన తర్వాత భూమి కోసం వెతకకుండా, ముందుగానే పారిశ్రామిక, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ శాఖ, జిల్లా కలెక్టర్ స్పష్టమైన యాక్షన్ క్యాలెండర్ను రూపొందించుకుని, నిర్దేశిత గడువులోగా ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి సూచించారు. కలెక్టర్ల సదస్సు కేవలం చర్చలకే పరిమితం కాకుండా, నిర్దిష్ట ఫలితాలు సాధించేలా ఉండాలని అన్నారు.

జిల్లాల అధిపతులుగా కలెక్టర్లు అన్ని శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై 360 డిగ్రీల కోణంలో దృష్టి సారించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించాల్సిన సమస్యలను కలెక్టర్లు పరిష్కరించాలని అన్నారు. సమస్యలను ప్రస్తావించడం మాత్రమే కాకుండా, వాటికి పరిష్కారాలు చూపేలా కలెక్టర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. బాధ్యతను మరొకరికి బదిలీ చేసే తత్వాన్ని విడనాడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా తాను మూడు నెలల కార్యక్రమాలను ముందుగానే నిర్దేశించుకుంటానని తెలిపారు. ప్రతి నెలా ఎస్ఐపీబీ సమావేశాలు, ప్రతి 15 రోజులకు కేబినెట్ సమావేశం, ప్రతి మూడు నెలలకు కలెక్టర్ల సదస్సుతో పాటు ప్రతి నెలా నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తున్నట్లు సీఎం వివరించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే కార్యక్రమాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ ప్రణాళికలు రూపొందించుకుంటున్నానని చెప్పారు. కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా కలెక్టర్లు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిర్ణయాల విషయంలో ఎస్కేపిజం కుదరదని, రియాక్టివ్ గవర్నెన్స్ కంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎస్సీ వర్గాలకు అందించే ప్రయోజనాలను బుడగ జంగాలకు కూడా వర్తింపజేసే అంశంపై తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బుడగ జంగాలకు ఎస్సీ హోదా కల్పించే అంశం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో, ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను వారికి కూడా అందించాలని స్పష్టం చేశారు.

వివిధ పరిశ్రమలతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అనుసంధానించాలని సీఎం సూచించారు. కరిక్యులమ్, పరికరాలు తదితర అంశాలను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన గృహాలను వేగంగా పూర్తి చేయాలని, అదనంగా మంజూరయ్యే గృహాలను దశలవారీగా అమలు చేయాలని సూచించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు మరో 1.5 లక్షల గృహాలు అదనంగా మంజూరయ్యే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు.

ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన అత్యవసర పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 50 శాతం హరిత ప్రాంతాన్ని సాధించే లక్ష్యంతో ప్లాంటేషన్ సీజన్కు ముందే అవసరమైన 20 కోట్ల విత్తనాలు, మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

తక్కువ నీటి అవసరం ఉన్న మొక్కలను ప్రోత్సహించాలని, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 905 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ భూముల వివరాలతో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్