Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

టీబీ పేషెంట్లకు ఆరు నెలలకు సరిపడా పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలి...

ప్రతి టీబీ పేషెంట్‌కు పోషకాహార కిట్లు అందేలా రెడ్‌క్రాస్, సత్యసాయి సొసైటీలు ముందుకు రావాలి: అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

టీబీ పేషెంట్లకు ఆరు నెలలకు సరిపడా పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలి...
Share Short Clip Download PDF

జిల్లాలోని ప్రతి టీబీ పేషెంట్‌కు ఆరు నెలలకు క్రమం తప్పకుండా పోషకాహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.

సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిక్షయ్ కార్యక్రమం క్రింద టీబీ పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ

ఖమ్మం జిల్లాలో సుమారు 3,000 మంది టీబీ పేషెంట్లు ఉన్నారని, ప్రతి పేషెంట్‌కు ఆరు నెలలకు సరిపడా పోషకాహారం అందేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో పాటు సత్యసాయి సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రతి టీబీ పేషెంట్‌కు న్యూట్రిషన్ కిట్లు అందేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎక్కువ మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గతంలో సుమారు 12 వేల న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశామని, ప్రస్తుతం కిట్ల పంపిణీ సంఖ్య తగ్గిందని తెలిపారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, సత్యసాయి సొసైటీలు ఈ అంశంపై సమీక్ష నిర్వహించి, జిల్లాలోని ప్రతి టీబీ పేషెంట్‌కు నిరంతరం పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు మాట్లాడుతూ..

క్షయ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి మందులతో పాటు మంచి పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నిక్షయ్ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో టీబీ పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. న్యూట్రిషన్ కిట్లలో పల్లీలు, 1.5 కిలోల పప్పు, 1 కిలో బియ్యం, పావు కిలో వంట నూనె ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, అధికారులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Source / reference: జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.