విద్య, వైద్యంతో పాటు క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, హనుమకొండలో క్రీడా మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని ప్రధాన క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
శనివారం హనుమకొండ లో అభివృద్ధి చేసిన స్విమ్మింగ్ పూల్‌ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయ్ తదితరులతో, జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న బ్యాడ్మింటన్ స్టేడియంను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పూలమాల వేశారు. ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ హనుమకొండ జేఎన్ఐఎస్ ప్రెసిడెంట్ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సభాధ్యక్షత వహించగా ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని అన్నారు. గత రెండున్నరేళ్లలో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. జేఎన్ఎస్ లో కల్పించిన క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడాకారులకు అవసరమైన మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్పోర్ట్స్ స్కూల్‌కు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
వరంగల్ క్రీడాకారులకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిందని, ఈ ప్రాంతానికి చెందిన అనేక మంది క్రీడాకారులు గతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. ప్రస్తుత తరం క్రీడాకారులు కూడా క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొంది ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. క్రీడల్లో సాధించే ప్రతి విజయం వ్యక్తిగత విజయంతో పాటు కుటుంబానికి, ఊరికి, జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
క్రీడాకారులు తమ ప్రతిభతో హనుమకొండ జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రోజే మాకు నిజమైన బహుమతి అని అన్నారు. హనుమకొండలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, స్పోర్ట్స్ స్కూల్‌కు సొంత భవన నిర్మాణం వంటి చర్యలు భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు దోహదపడనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
హనుమకొండను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు: జిల్లా కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయి
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ..
క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. జేఎన్ఎస్‌లో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ లలో క్రీడా వసతులను మెరుగైన ప్రమాణాలతో అభివృద్ధి చేశామని తెలిపారు. క్రీడాకారులు ఈ సదుపాయాలను తమ సొంత ఆస్తిగా భావించి సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటి పరిరక్షణకు కూడా సహకరించాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్‌కు ప్రత్యేక భవనం నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేశామని, ఈ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలకే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని కలెక్టర్ ఆకాంక్షించారు. యువ క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, వసతులు అందించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
హనుమకొండ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ..
దాదాపు కోటిన్నర రూపాయలతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణముతో నిర్మించిన వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్విమ్మింగ్ పూల్ ప్రారంభించిన అనంతరం స్పోర్ట్స్, స్విమ్మింగ్ అకాడమీ క్రీడాకారులు స్విమ్మింగ్ చేయగా ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్లు పరిశీలించారు. బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఏసిపి జితేందర్ రెడ్డి, బొద్ధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్యాడ్మింటన్ ఆడారు. బ్యాడ్మింటన్ వెటరన్ క్రీడాకారులు రమణయ్య, కైలాసం లను ఎమ్మెల్యే కలెక్టర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కైలాస్ యాదవ్, ఆఫీసర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, ఏసీపీ జితేందర్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ హనుమకొండ ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.