నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యన్ యన్ ఏ.ఐ సొల్యూషన్ – యన్ యన్ హ్యాకథాన్ 2026 కార్యక్రమం ఓ ప్రైవేట్ ఐ టీ టవర్స్ యందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు, యువత, టెక్నాలజీ నిపుణులతో ముచ్చటిస్తూ వారు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులు మరియు సమస్యల పరిష్కార విధానాలను పరిశీలించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత సద్వినియోగ చేసుకోవాలి
⏩ నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ..
ప్రస్తుత ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కీలకంగా మారుతోందన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వివిధ సామాజిక సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకత, ఆలోచనా శక్తి, సాంకేతిక నైపుణ్యాలను సరైన దిశలో వినియోగిస్తే సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కోడ్ ఫర్ చేంజ్ వంటి కార్యక్రమాలు యువతను సాంకేతిక రంగంలో మరింత ప్రోత్సహించడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే వినూత్న పరిష్కారాలను రూపొందించేందుకు వేదికగా నిలుస్తాయని అన్నారు.
పోలీసింగ్ వ్యవస్థలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజా భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, డేటా విశ్లేషణ, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించే దిశగా సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందని పేర్కొన్నారు. యువత కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడమే కాకుండా, దానిని ప్రజా ప్రయోజనం, సమాజ శ్రేయస్సు మరియు దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
యువత రోడ్డు భద్రత నియమావళిని తప్పనిసరిగా పాటించాలని 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వలన జిల్లా వ్యాప్తంగా 327 మంది మరణించారని అదే కోవిడ్ సమయంలో 200 మంది చనిపోయారని గుర్తు చేశారు. యువత అనుక్షణం సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా హ్యాకథాన్‌లో పాల్గొన్న యువత, విద్యార్థులకు ప్రశంసా పత్రములు ఇచ్చి అభినందించారు.
ఈ కార్యక్రమంలో నజీబ్(సి.ఈ.ఓ), షేక్ సబ్బార్( మేనేజర్), రజనీకాంత్, ప్రతినిధులు, నిర్వాహకులు, టెక్నాలజీ నిపుణులు, విద్యార్థులు మరియు యువత పాల్గొన్నారు.