ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటనను దృష్టిలో ఉంచుకొని, నిజామాబాద్ జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలను సమీక్షించేందుకు ప్రత్యేక సమావేశం కమాండ్ కంట్రోల్ హాల్ యందు నిర్వహించారు.
ఈ సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
చిన్న పిల్లల ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి...
⏩ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమీక్ష...
ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో చిన్నారుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో అగ్నిమాపక పరికరాల అందుబాటు, వాటి పనితీరు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఫైర్ అలారం వ్యవస్థ, విద్యుత్ భద్రత, సిబ్బందికి ఫైర్ సేఫ్టీపై అవగాహన, అత్యవసర సమయంలో రోగులను సురక్షితంగా తరలించే విధానం తదితర అంశాలను పరిశీలించారు.
చిన్నారులు చికిత్స పొందుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు ముందస్తు భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, ఫైర్ సర్వీసెస్, వైద్య సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించే విధంగా అవసరమైన ఏర్పాట్లు, మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లోపాలు గుర్తించినట్లయితే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించారు.
చిన్నారులు, వారి తల్లిదండ్రులు మరియు ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ మరియు ఫైర్ సర్వీసెస్ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్ శుభం ప్రకాష్, డిఎం అండ్ హెచ్ఓ బి. రాజశ్రీ, జిల్లా ఫైర్ అధికారి టి. పరమేశ్వర్, ఎన్.ఎస్.సి ప్రెసిడెంట్ డాక్టర్ కవిత రెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, ఐ.ఎం.ఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్, ఎలక్ట్రిసిటీ ఎస్.ఈ పి.వి రాజేశ్వర్ రావ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సిసిఆర్.బి, ఎ.సి.పి లు శ్రీ ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, గురు నాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేశం మరియు జిల్లాలోని చిన్నపిల్లల సంబంధించిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.