Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలి

⏩భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి | ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలి
Share Short Clip Download PDF

⏩ హనుమకొండ కలెక్టరేట్ నుండి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ సమావేశం.

హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, జిల్లాలో వర్ష ప్రభావం, ప్రస్తుత పరిస్థితులు, గురు, శుక్రవారాలపాటు వర్షాలకు హై అలెర్ట్ ఉన్న నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.

మండలాల వారీగా వర్షపాతం, చెరువుల పరిస్థితి, వాగులు, వంకలు, రహదారుల పరిస్థితి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో వర్షాల సమయంలో సమస్యలు ఎదురైన ప్రాంతాల వివరాలను తెలుసుకుని, ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టడంపై అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలను జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ

జిల్లాలోని వేలేరు , ఆత్మకూర్ మండలాల్లో బుధవారం కురిసిన వర్షంతో అధిక వర్షపాతం నమోదైందన్నారు. నేడు, రేపు (గురువారం, శుక్రవారం)కూడా ఆకస్మికంగా భారీ వర్షపాతం నమోదైతే వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులపైకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలను అధికారులు చేపట్టాలన్నారు.

చెరువులు, వాగులు, వంకల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వరద నీరు రహదారులపైకి వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లాలోని అన్ని చెరువుల్లో ప్రస్తుతం ఎంత మేర నీరు ఉందో సాగునీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షపాతం పెరిగినప్పుడు చెరువుల నీటిమట్టం, నీటి ప్రవాహ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆ శాఖ అధికారులకు సూచించారు.

భారీ వర్షాల సమయంలో అధికారులు తమ పరిధిలో స్థానికంగానే అందుబాటులో ఉండాలని, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే క్షేత్రస్థాయిలో స్పందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గతంలో వర్షాల సమయంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రస్తుతం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను పరిశీలించాలని ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నాలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను వెంటనే తొలగించాలన్నారు.

ప్రధాన నాలాల వద్ద వరద నీరు నిలిచిపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలాగే అన్నీ మండలాల్లో అవసరమైన ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు జేసీబీలు, ఇతర యంత్రాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా సమస్య వచ్చినట్లయితే వెంటనే సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. కంట్రోల్ రూమ్‌లో అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎక్కడ సమస్య తలెత్తే అవకాశం ఉందో ముందుగానే గుర్తించి, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారులు, వాగులు, వంకలు, చెరువులు, డ్రైనేజీ వ్యవస్థల పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.

జిల్లాలో ఎక్కడైనా వర్షాల కారణంగా జరిగిన నష్టం పై వెంటనే వివరాల నివేదికను అందజేయాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎడతెరపి లేకుండా వర్షం కురిసినప్పుడు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ గూగుల్ మీట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డీఎస్ వెంకన్న, జడ్పీ సీఈఓ శేషాద్రి, పరకాల మున్సిపల్ కమిషనర్ పవన్, సాగునీటి పారుదల శాఖ ఈఈ మంగీలాల్, రోడ్లు,భవనాలు శాఖ ఈఈ దేవిక చౌహన్, ఇతర శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలి