Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పకడ్బందీ ప్రణాళికతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి: మంత్రి ధనసరి అనసూయ సీతక్క

⏩రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

పకడ్బందీ ప్రణాళికతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి: మంత్రి ధనసరి అనసూయ సీతక్క
Share Short Clip Download PDF

⏩హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎల్ నినో సన్నద్ధత, విబిజి రాంజీ, ఆర్డబ్ల్యూఎస్, హ్యామ్ రోడ్స్ పై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం.

తాగునీటి సరఫరాకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, పకడ్బందీ ప్రణాళికతో తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎల్ నినో సన్నద్ధత, విబిజి రాంజీ, ఆర్డబ్ల్యూఎస్, హ్యామ్ రోడ్స్ పై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ముందుగా జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న సీతక్కకు పోలీసులు గౌరవ వందనం సమర్పించగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఎల్ నినో, తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. సాగునీరు, తాగునీరుకు సంబంధించిన అంశాలను సాగునీటి పారుదల శాఖ అధికారులు, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులు ఆయా శాఖల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతి గురించి వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ

తాగునీరు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చేపట్టే బోర్ రీచార్జ్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని, నీటి నిల్వలు, రిజర్వాయర్లు, బోర్లు, మోటార్లు తదితర వాటి పరిస్థితిని నిరంతరం పరిశీలించాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా వేసవి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ప్రతీ ఇంటింటికీ ఇంకుడు గుంత, ప్రతీ పంటకు పంట కుంటలను,ప్రతీ ఊరు కి ఊట కుంట లను నిర్మించాలన్నారు

గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, నీటి రీచార్జ్‌ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వీటి ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు అవసరమైన తాగునీటి వసతులను కూడా ప్రత్యేకంగా పరిశీలించాలని అన్నారు. ప్రజలకు సరఫరా చేసే నీరు స్వచ్ఛమైనదిగా.. సురక్షితమైనదిగా ఉండేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ప్రతి గ్రామంలో తాగునీటి వనరుల పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ, నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్న, పెద్ద మోటార్ల మరమ్మతులు, పైపులైన్ల సమస్యలు తదితర సమస్యలను వెంటనే గుర్తించి పునరుద్దరణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ఏడాది వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాగునీరు, తాగునీటి సరఫరాకు సంబంధించి గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసి ఇవ్వాలన్నారు. ప్రతిపాదిత పనులను వేగవంతంగా పూర్తి చేయడంపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టెందుకే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

రోడ్లు, వంతెన, చెక్ డ్యామ్, తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల పరిధిలో చేపట్టిన హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఆవాసం నుండి గ్రామానికి, గ్రామం నుండి మండల కేంద్రానికి రహదారి సదుపాయం ఉండాలనేదే హ్యామ్ రోడ్స్ లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధి కల్పించడం ద్వారా కూలీలకు ఉపయోగపడాలన్నారు. ఉపాధి కల్పించడం ద్వారా గ్రామం సమగ్రభివృద్ది చెందుతుందన్నారు. గ్రామాభివృద్ధికి ఇదొక వరంలాంటిదన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ మాట్లాడుతూ..

వీబీజీ రాంజీ పథకం ద్వారా కూలీలకు పని దినాలు కల్పించాలని అన్నారు. పథకం ద్వారా చేపట్టిన పనుల పురోగతి పై ప్రతి పదిహేను రోజులకోసారి అధికారులు సమీక్ష చేయాలన్నారు. పనులను పూర్తి చేయడంలో, కూలీలకు ఉపాధి కల్పించే విషయంలో స్థానిక సర్పంచులను భాగస్వామ్యం చేయాలన్నారు.

ఈ సమావేశంలో సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ మాట్లాడుతూ..

ఎల్ నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి అనే అంశాలపై అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎల్ నినో ప్రభావం ప్రధానంగా వాతావరణం వ్యవసాయం వర్షపాతం నీటి లభ్యత వంటి కీలక రంగాలపై పడే అవకాశం ఉందన్నారు.

వర్షపు నీరును ఒడిసిపట్టడం నిల్వ చేయడం భూగర్భ జలాలను పెంచడం నీటి సంరక్షణ చర్యలను చేపట్టడం అత్యంత ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో కూడా కొన్ని ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం నమోదు ఉన్నప్పటికీ భవిష్యత్తులో వర్షపాతం స్థిరంగా ఉండే పరిస్థితిలో దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశం లో స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ లు చాహత్ బాజ్ పాయి,అడిషనల్ కలెక్టర్లు, మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ ENC జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సమీక్షా సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క మీడియాతో మాట్లాడుతూ...

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి పంచాయితీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి హ్యామ్ రోడ్లకు సంబంధించి సమీక్ష లో చర్చించామన్నారు. దాదాపు పదిహేడు వేల కిలోమీటర్ల రోడ్లను చేపడుతున్నట్లు తెలిపారు. హ్యామ్ రోడ్లను మూడు విడతలలో పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల గ్రామీణ అభివృద్ధి రోడ్లను డెవలప్ చేస్తున్నామని చెప్పారు. మొదటి విడత ఏడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లను చేయబోతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా మూడువేల గ్రామ పంచాయితీలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. మొత్తము పదిహేనేళ్లలో ఈ రోడ్ల మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్స్ నే చూసుకునే విధంగా ఈ హ్యామ్ రోడ్లలో ప్రణాళిక ఉందన్నారు. ఎప్పటి నుంచి పనులు మొదలు పెట్టాలనేది అధికారులకు సమీక్షా సమావేశంలో దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఏజెన్సీలకు పనులు మొదలుపెట్టడానికి తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్ 25 నుంచి కొన్ని వర్క్స్, నవంబర్ మొదటి వారంలో మరికొన్ని వర్క్స్ స్టార్ట్ చేయాలని వారిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

గ్రామాలలో రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఆవాసం నుండి గ్రామపంచాయతీ వరకు, గ్రామపంచాయతీ నుండి మండల కేంద్రం వరకు ఖచ్చితంగా రోడ్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ హ్యామ్ ప్రాజెక్టును తీసుకోవడం జరిగిందన్నారు. హ్యామ్ రోడ్స్ నుంచి దాదాపు సంవత్సర కాలం నుండి చర్చలు సాగుతున్నాయన్నారు.

ములుగులో హ్యామ్ రోడ్స్ సంబంధించి ఫైలాన్ కూడా గత నెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అక్టోబర్ 25 నుంచి వర్క్స్ స్టార్ట్ చేయాలని దిశా నిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం గురించి అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు. ఎల్ నినోని ఏ రకంగా ఎదుర్కోవాలనేది చర్చలలో తీర్మానాలు కూడా పెట్టడం జరిగిందన్నారు.

రొటీన్ గా ఉపాధి పనినే కాకుండా ఆ పని ద్వారా గ్రామాలల్లో అసెట్స్ క్రియేట్ చేయడం, వాటర్ షెడ్స్ నిర్మించుకోవడంలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా దాదాపు నాలుగు నెలల నుంచి మొదలు పెట్టడం జరిగిందన్నారు. జలసిరి కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊటకుంట, ప్రతి పంటకు పంట కుంట, ఏజెన్సీ గ్రామాల్లో వాగు దగ్గర ఒక చెక్ డ్యామ్ నిర్మించుకోవడం చేశామన్నారు.

అక్టోబర్ రెండవ తేదీన హైదరాబాద్, ఇతర జిల్లాలో గాని సమావేశాలను ఏర్పాటు చేసుకుని గ్రామ సమగ్ర ప్రణాళికను గ్రామ సర్పంచుల ద్వారానే అక్కడ ఏమేమి వర్క్స్ చేయాలనేది కూడా మ్యాప్ తయారు చేసి, ఆ మ్యాప్ పోస్టర్లను అక్టోబర్ రెండో తారీఖు నాడు గాంధీ జయంతి సందర్భంగా ఆవిష్కరించుకొని అప్పటి నుంచి గ్రామీణ అభివృద్ధి పనులను వేగంగా మొదలుపెట్టి గ్రామాలను బలోపేతం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులలో పంట చేనుల్లో పంట కుంటలు, కాటిల్ షెడ్స్ నిర్మించుకోవడం, కోళ్ల పెంపకం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా తాగునీటికి సంబంధించి ఎల్నినో ప్రభావం కారణంగా తాగునీటి సమస్యలు వచ్చాయని, కొన్ని ఏరియాలలో బాగా భూగర్భ జలం తగ్గిపోవడం, వర్షాలు లేకపోవడం జరిగిందన్నారు. ఉమ్మడి వరంగల్,ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడున్నంత వరకు మనకు వచ్చే నీళ్లలో ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ వాడుకోవడానికి సఫిషియంట్గా సరిపోతుందన్నారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో వర్షాలు లేవని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీళ్లను తాగునీటికి సద్వినియోగం చేసుకోవడంపై ఎలాంటి ఇబ్బంది ఉండదనే అంచనా ఉన్నట్లు తెలిపారు. విడతలవారీగా సమావేశాలు నిర్వహించి తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్లు తెలిపారు.

అటవీ ప్రాంతాల్లోని ఆవాసాలకు తాగు నీటిని అందించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో చెక్ డ్యామ్ నిర్మించుకోవడం, బావులను తవ్వడం కోసం తదితర కార్యాచరణ కోసం ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు... వెయ్యి రోజుల పాలనలో 67 వేల కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు మంజూరు చేసి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకి ప్రోత్సాహం అందించామన్నారు.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, రాష్ట్రంలో దాదాపు 5 53 మండలాల్లో మహిళా సంఘాలకు బస్సులను అందించామని, అలాగే ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డు లకు కూడా మహిళలకె ప్రాధాన్యమిస్తూ లబ్ధిదారులుగా గుర్తిస్తున్నామాన్నారు.

విబిజీ రాంజీ ద్వారా ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయలను అందించబోతున్నామని...ఆ నిధులతో భూగర్భ జల సంరక్షణ కోసం అలాగే వివిధ అభివృద్ధి పనులను చేపట్టలన్నారు.