కేసీఆర్ ఫామ్‌హౌస్ కేంద్రంగా ఉన్న ఎర్రవల్లి భూముల వివాదంలో విచారణ ప్రారంభమయింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో రెవెన్యూ యంత్రాంగం వేగంగా రంగంలోకి దిగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో వివాదంలో ఉన్న సుమారు 385 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములు ఎంతమేర కలిసి ఉన్నాయో 30 రోజుల్లోగా తేల్చాలని అసెంబ్లీ వేదికగా సీఎం ఆదేశించిందున , గురువారం సిద్దిపేట జిల్లా మార్కూక్ తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై సంబంధిత రెవెన్యూ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారుఈ క్రమంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ మార్కూక్ తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్లు, రెవెన్యూ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని సర్వే నంబర్లు, పాత పహాణీలు, భూముల రిజిస్ట్రేషన్ దస్తావేజులు, ప్రభుత్వ సీలింగ్ లేదా అసైన్డ్ భూముల రికార్డులను అధికారులు సమగ్రంగా బేరీజు వేశారు. వివాదాస్పద భూములపై క్షేత్రస్థాయిలో డిజిటల్ సర్వే చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రెవెన్యూ బృందాలు యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నాయి.రికార్డుల ప్రాథమిక పరిశీలన పూర్తయిన వెంటనే, సర్వే నిర్వహణకు ముందు చట్టబద్ధంగా కేసీఆర్‌తో పాటు సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. భూ సర్వే చట్టం ప్రకారం నోటీసులు అందజేసి, వారి సమక్షంలోనే సర్వేయర్లతో కలిసి సరిహద్దులను కొలవాలని నిర్ణయించారు. నోటీసుల వ్యవహారంపై లీగల్ అంశాలను పరిశీలిస్తున్న యంత్రాంగం, ఒకటి రెండు రోజుల్లోనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ప్రతినిధులకు లేదా కేసీఆర్‌కు నేరుగా నోటీసులు అందజేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబ భూముల చిట్టాను బయటపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నెల రోజుల గడువు విధించి నేరుగా క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ సర్వేలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు తేలితే ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది.