Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నిరంతర జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా పరిశోధకులు ముందుకు సాగాలి: కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం

నిరంతర జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా పరిశోధకులు ముందుకు సాగాలి: కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం
Share Short Clip Download PDF

విద్యార్థులు, పరిశోధకుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన వసతుల కల్పన, పరిశోధనకు ప్రోత్సాహం, నిధుల కేటాయింపునకు కాకతీయ యూనివర్సిటీ ప్రాధాన్యత ఇస్తోందని, పరిశోధకులు నిరంతర జ్ఞాన సముపార్జనను తమ లక్ష్యంగా చేసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్‌లో యూనివర్సిటీ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ ఆధ్వర్యంలో సంచాలకులు ఆచార్య ఎన్. ప్రసాద్, అదనపు సంచాలకులు డా. టి. శాస్త్రి సారథ్యంలో నిర్వహించిన వారం రోజుల శిక్షణా కార్యశాల ముగింపు కార్యక్రమానికి రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా హాజరై, పాల్గొన్న వారికి ధ్రువపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆచార్య రామచంద్రం మాట్లాడుతూ..

వైస్‌చాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి సారథ్యంలో రుసా నిధులను పరిశోధనాభివృద్ధికి సద్వినియోగం చేస్తున్నామని తెలిపారు. పరిశోధనా ప్రయోగశాలల అభివృద్ధి, ఆధునిక సాఫ్ట్‌వేర్‌ల సమకూర్పు, పరిశోధకులకు అవసరమైన సాంకేతిక వసతుల కల్పనకు నిధులను వినియోగిస్తున్నామని అన్నారు. వీటి ద్వారా పరిశోధనల విస్తృతి, నాణ్యత, కచ్చితత్వాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో పరిశోధనకు అన్ని విధాలా సహకారం అందిస్తామని, విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన పరిశోధనా పత్రాలను ప్రచురించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఫార్మసీతో పాటు ఇతర సైన్స్ విభాగాల పరిశోధక విద్యార్థులు కూడా నిరంతర పరిశోధనపై దృష్టి సారించి, తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు.

కార్యశాల సంచాలకులు ఆచార్య ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ..

వారం రోజుల పాటు నిర్వహించిన కార్యశాలలో AI-Powered Drug Discovery, Molecular Modelling, Virtual Screening and Docking, Biomolecular Simulation, Accelerated Drug Discovery వంటి ఆధునిక అంశాలపై నిపుణులచే ప్రయోగాత్మక శిక్షణ అందించినట్లు తెలిపారు. అడ్వెంట్ ఇన్ఫర్మాటిక్స్ లిమిటెడ్, పూణేకు చెందిన డా. దీపక్ శర్మ, డా. నచికేత్ జోషి, డా. షంషేర్ సింగ్, తదితరులు రిసోర్స్ పర్సన్స్‌గా పాల్గొని శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. కార్యశాలలో నేర్చుకున్న అంశాలను పరిశోధకులు తమ పరిశోధనల్లో ఆచరణలో పెట్టాలని సూచించారు.

అదనపు సంచాలకులు డా. టి. శాస్త్రి మాట్లాడుతూ..

ఆధునిక పరిశోధనా పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు నాణ్యమైన పరిశోధనా పత్రాల ప్రచురణకు పరిశోధకులను ప్రోత్సహించడమే కార్యశాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పరిశోధకుల్లో ఇన్నోవేటివ్ ఆలోచనలు, కొత్త పరిశోధనా దృక్పథం పెంపొందాలని ఆకాంక్షించారు. కార్యశాలలో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఆధునిక పరిశోధనా సాంకేతికతలతో పాటు కృత్రిమ మేధస్సు (AI)ను పరిశోధనలో సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్నామని తెలిపారు. కార్యశాల తమ పరిశోధనా నైపుణ్యాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు. పూణే అడ్వెంట్ ఇన్ఫర్మాటిక్స్ ముఖ్య అధికారి సురోజిత్ సాధు కు కృతఙ్ఞతలు తెలిపారు.

నిరంతర జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా పరిశోధకులు ముందుకు సాగాలి: కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం