వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కే. ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు విశ్వవిద్యాలయ రెడ్‌క్రాస్‌ నోడల్‌ ఆఫీసర్‌ ఆచార్య ఈసం నారాయణ తెలిపారు. సోమవారం విశ్వవిద్యాలయ సెనెట్‌ హాల్‌లో జరిగిన జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశంలో భాగంగా రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ బోధనా, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు, ఇతర భాగస్వాములు రెడ్‌క్రాస్‌లో శాశ్వత సభ్యులు లేదా సాధారణ సభ్యులుగా నమోదు చేసుకుని, విశ్వవిద్యాలయం నిర్దేశించిన సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించాలని ఆయన కోరారు. రెడ్‌క్రాస్‌ ద్వారా నిర్వహించే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.