Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

మహిళల భద్రతకు మరో ముందడుగు

తిరుపతిలో అధునాతన మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.

మహిళల భద్రతకు మరో ముందడుగు
Share Short Clip Download PDF

మహిళల భద్రత, రక్షణకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన అధునాతన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించిన అనంతరం స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ..

మహిళల భద్రత, రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా బాధితులకు తక్షణ పోలీస్ సేవలు, న్యాయం అందించడంతో పాటు వారికి ధైర్యం, భరోసా కల్పించేలా మహిళా పోలీస్ స్టేషన్లను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చని, వారి సమస్యలను సున్నితంగా స్వీకరించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ ద్వారా కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. సుమారు ₹2.70 కోట్ల వ్యయంతో 8,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మోడల్ మహిళా పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. మహిళా బాధితులకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడంతో పాటు పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.

కౌన్సెలింగ్ కేంద్రం..

కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి, కుటుంబ, దాంపత్య మరియు సామాజిక సమస్యలను వీలైనంత వరకు కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి వారానికి రెండు రోజుల పాటు సైకియాట్రిస్ట్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. మహిళా పోలీస్ స్టేషన్ కేవలం ఫిర్యాదులు స్వీకరించడం, కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా కుటుంబాల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు కూడా దోహదపడేలా పనిచేయాలనే లక్ష్యంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ఫిర్యాదుల కోసం మహిళలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చే చిన్నారుల కోసం ప్రత్యేకంగా చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలతో వచ్చే మహిళలకు కూడా అవసరమైన ప్రత్యేక వసతులను కల్పించారు. అదేవిధంగా కుటుంబ సంబంధాలు, పెద్దలను గౌరవించడం, చిన్నారుల పెంపకం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు.
మహిళలపై జరిగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ వేధింపులు మరియు ఇతర డిజిటల్ నేరాలపై వేగంగా స్పందించేందుకు 24/7 సైబర్ సహాయ కేంద్రంను అందుబాటులోకి తీసుకువచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మహిళలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.

తిరుపతి జిల్లాలో మహిళలపై నేరాల తగ్గుదల

తిరుపతి జిల్లాలో మహిళలపై నమోదవుతున్న నేరాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 94 నుంచి 58కి తగ్గడం గమనార్హమని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న నిరంతర చర్యలు, అవగాహన కార్యక్రమాలు, పటిష్టమైన పోలీసింగ్ దీనికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం భద్రతా భరోసా కల్పించేలా విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖలో మౌలిక వసతుల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
రాష్ట్రంలోని పాత జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కూడా సొంత భవనాలతో మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని హోం శాఖ మంత్రి తెలిపారు. సొంత భవనాలు లేని ప్రాంతాల్లో నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్, భక్తుల రద్దీ మరియు పోలీస్ శాఖపై పెరుగుతున్న పని ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని హోం శాఖ మంత్రి తెలిపారు. దీనివల్ల పోలీస్ సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడంతో పాటు శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం.. రక్షణే మన బాధ్యత” అనే సంకల్పంతో మహిళలకు మరింత భద్రత, గౌరవం మరియు తక్షణ పోలీస్ సహాయం అందించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు తెలిపారు. మహిళలు తమ సమస్యలను ఎటువంటి భయం లేదా సంకోచం లేకుండా పోలీసులను ఆశ్రయించి, అందుబాటులో ఉన్న పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసన సభ్యులు అరణి శ్రీనివాసులు, చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం, శ్రీకాళహస్తి శాసన సభ్యులు , బొజ్జల సుధీర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసన సభ్యులు నెలవల విజయశ్రీ, కోడూరు శాసన సభ్యులు ఆరవ శ్రీధర్.
అదనపు ఎస్పీలు శ్రీనివాసులు (పరిపాలన) రవిమనోహరచారి (శాంతిభద్రతలు) ఐ రామకృష్ణ (తిరుమల) శ్రీనివాస రావు శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్) పాల్గొన్నారు.